కాంగ్రెస్‌కు వరమా.. శాపమా?

దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటం, ఆ వెంటనే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది.

Published : 25 Mar 2023 03:58 IST

ప్రధాన ప్రతిపక్షానికిది ఆయుధంగా మారుతుంది
ప్రజల్లో సానుభూతి వస్తుంది
రాహుల్‌పై అనర్హత వేటుపై రాజకీయ నిపుణుల విశ్లేషణ
స్టే ఉత్తర్వులు రాకపోతే నష్టమేనని హెచ్చరిక

దిల్లీ: దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటం, ఆ వెంటనే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తాజా పరిణామాలు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా ప్రస్తుతం కనిపిస్తున్నప్పటికీ ఆ పార్టీకి, రాహుల్‌కు అంతిమంగా లబ్ధి కలిగిస్తాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజకీయంగానే కాకుండా న్యాయ పోరాటానికీ సిద్ధంకావాల్సిన అనివార్య పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడిందని, దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో వచ్చే కదలిక సంస్థాగతంగా బలోపేతం కావడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

అవకాశం...అవరోధం కూడా..

‘లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం తక్షణం రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దెబ్బగా కనిపిస్తోంది. అయితే, భారత్‌ జోడో యాత్రతో ప్రజాదరణను పొందిన రాహుల్‌కు ప్రస్తుత పరిణామాలు అదనపు ప్రయోజనం కలిగిస్తాయ’ని సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. బాధితుడిగా మారిన రాహుల్‌ గాంధీ ‘హీరో’గా అవతరిస్తారని తెలిపారు. అయితే, తనకు విధించిన జైలు శిక్షను, అనర్హత వేటును రాహుల్‌ రద్దు చేయించుకోకపోతే ఆయన రాజకీయ జీవితానికి అవే అవరోధంగా మారుతాయని హెచ్చరించారు. ‘‘ఒక ఏడాది వ్యవధి మాత్రమే ఉన్న ప్రస్తుత లోక్‌సభకు అనర్హుడు కావడం వల్ల పెద్దగా సమస్య ఎదురుకాదు. అసలైన ప్రమాదం ఏమిటంటే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేకపోవడం. ప్రజాదరణ ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోతే పార్టీకి ఎలా నేతృత్వం వహించగలరు. కనుక తక్షణమే అనర్హత వేటు నుంచి రక్షణ పొందాల్సిన అవసరం ఉంద’’ని స్పష్టం చేశారు.

విపక్షాలన్నీ ఏకతాటిపైకి..

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వల్ల ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి వస్తోందని రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే అసెంబ్లీల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. తాజా పరిణామాలతో 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట విపక్షాలన్నిటినీ భాజపా ఏకం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత సంజయ్‌ ఝా తెలిపారు. భాజపా వ్యతిరేక పార్టీలన్నీ కలిసి పనిచేసేందుకు అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు.

వెంటనే అప్పీలుకు వెళ్లాలి...

కోర్టు తీర్పు అమలును నిలుపుదల(స్టే) చేసే ఉత్తర్వులు పొందగలిగితే లోక్‌సభ సభ్యత్వ అనర్హతను తొలగించాలని సభాపతిని కోరే అవకాశం రాహుల్‌కు లభిస్తుందని న్యాయనిపుణులు తెలిపారు. రాహుల్‌  వెంటనే ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేయాలని సీనియర్‌ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ సూచించారు. ఆలస్యం చేస్తే ఎన్నికల సంఘం రంగ ప్రవేశం చేసి వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటిస్తుందన్నారు. రాహుల్‌కు విధించిన జైలు శిక్షను హైకోర్టు నిలుపుదల చేయగలదని, తద్వారా ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణకు వీలు కలుగుతుందని మరో సీనియర్‌ న్యాయవాది అజిత్‌ సిన్హా అభిప్రాయపడ్డారు.  

స్టే రాకపోతే..8 ఏళ్లు పోటీ చేయలేరు

సూరత్‌ కోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయకపోతే రాహుల్‌   8 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరని సంబంధిత నిబంధనలపై విశేష అవగాహన ఉన్న నిపుణుడు ఒకరు తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం..జైలు శిక్ష అనుభవించే రెండేళ్లతో పాటు విడుదలైన తర్వాత ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఇలా మొత్తం 8 ఏళ్లు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుందని వివరించారు. ప్రస్తుత లోక్‌సభ గడువు వచ్చే ఏడాది జూన్‌లో ముగుస్తుందనుకుంటే ఏడాదికి పైగా సమయం ఉంది. కనుక వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ప్రకటించ వచ్చు. ఏడాది కన్నా తక్కువ వ్యవధి ఉంటే ఉప ఎన్నికలకు వెళ్లదు. సూరత్‌ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు నెల రోజులున్నందున అప్పటివరకూ ఎన్నికల సంఘం వేచి చూస్తుందని, ఆ లోగా రాహుల్‌ స్టే ఆదేశాలు పొందకపోతేనే తదుపరి చర్యలు చేపడుతుందని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని