మహిళా రిజర్వేషన్ల బిల్లు ఉద్యమం ఉద్ధృతం: కవిత

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ చేపట్టిన ఉద్యమాన్ని ఇక ఉద్ధృతం చేయనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

Published : 25 Mar 2023 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ చేపట్టిన ఉద్యమాన్ని ఇక ఉద్ధృతం చేయనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇప్పటికే జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టామని, దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా సంఘాల ప్రతినిధులతో భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని కూడా నిర్వహించామని ఆమె వెల్లడించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేసినప్పటికీ.. కేంద్రం విస్మరించినందున ఆందోళనను మరింత తీవ్రం చేయాలని నిర్ణయించినట్లు కవిత పేర్కొన్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా శుక్రవారం ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఉద్యమ విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మిస్డ్‌ కాల్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో పాటు.. దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు కవిత పోస్టు కార్డులు రాయనున్నారు. ‘మహిళలకు సాధికారత కల్పిద్దాం. దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వండి’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు ఆమె వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు