ప్రశ్నపత్రాల లీకేజీపై కేసీఆర్‌, కేటీఆర్‌ చర్చకు రావాలి: రేవంత్‌

‘‘పోలీసులను పంపి నన్ను గృహనిర్భంధం చేయడం కాదు. కేసీఆర్‌, కేటీఆర్‌లు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలి.

Published : 25 Mar 2023 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘పోలీసులను పంపి నన్ను గృహనిర్భంధం చేయడం కాదు. కేసీఆర్‌, కేటీఆర్‌లు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలి. లీకేజీలో మీపాత్ర లేకపోతే నా సవాల్‌ను స్వీకరించాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీ చెలగాటమాడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో 24, 25 తేదీల్లో నిరసన తెలపాలనుకున్నాం. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నిరసనలో పాల్గొని నిరుద్యోగులకు అండగా నిలబడాలనుకున్నా. కానీ ప్రభుత్వం నియంతృత్వ పోకడతో మమ్మల్ని నిర్బంధించింది. అనర్హులను టీఎస్‌పీఎస్సీలో సభ్యులుగా నియమించడంపై కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్‌ వినాయకరెడ్డి కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఎలా తీసుకుందని కౌంటర్‌ వేయాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం కౌంటర్‌ వేయకుండా వాయిదాలు తీసుకుంది. 90 మంది అభ్యర్థులతో మధ్యాహ్నం 1 నుంచి 3.30 గంటల వరకు లాలాగూడ ఎస్‌.ఎఫ్‌.ఎస్‌ హైస్కూల్‌ సెంటర్‌లో పరీక్ష రాయించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకే నిర్వహించాల్సిన పరీక్షను సమయం దాటిన తరువాత కొందరికి ఎలా నిర్వహించారు. ఈ కేసును నీరుగార్చడానికే సిట్‌కు బదిలీ చేశారు. దీంతో కేటీఆర్‌కు సంబంధముంది. ఈనెల 27న ఉదయం సాయంత్రం వరకు కాంగ్రెస్‌ శ్రేణులు జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలి. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని వర్సిటీల విద్యార్థులను కలవాలని నిర్ణయించుకున్నాం. దిల్లీలో ఈడీ, సీబీఐ డైరెక్టర్లకు ఫిర్యాదు చేస్తాం. ఏప్రిల్‌ 2వ వారంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో నా పాదయాత్రను ఏప్రిల్‌ 6 వరకూ వాయిదా వేసుకున్నా. రాహుల్‌పై భాజపా కక్ష సాధింపులకు పాల్పడుతోంది. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రం ఇలా చేస్తోంది’’ అని అన్నారు.


రేవంత్‌రెడ్డి గృహనిర్బంధం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: నిరుద్యోగులకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తలపెట్టిన నిరసనకు వెళ్లేందుకు ప్రయత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం గృహనిర్బంధం చేశారు. శుక్రవారం ఉదయం 5 నుంచే పశ్చిమ మండల ఠాణాల పోలీసులు రేవంత్‌ నివాసాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నారు. ఆయనకు మద్దతుగా వచ్చిన జూబ్లీహిల్స్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె.రమేశ్‌తో పాటు పలువురిని పోలీసులు జూబ్లీహిల్స్‌ ఠాణాకు తరలించి తర్వాత విడిచిపెట్టారు. సాయంత్రం 6.30 గంటలకు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు రేవంత్‌ నివాసం నుంచి వెళ్లిపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు