Rahul Gandhi: రాహుల్‌పై అనర్హత వేటు

దేశ రాజకీయాల్లో భారీ కుదుపు. సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడింది.

Updated : 25 Mar 2023 05:51 IST

సూరత్‌ కోర్టు తీర్పుతో లోక్‌సభ సభ్యత్వం రద్దు
నోటిఫికేషన్‌ జారీ
ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు..
రాజకీయ, న్యాయపోరాటం చేస్తాం: కాంగ్రెస్‌
బాసటగా నిలిచిన విపక్షాలు.. నిర్ణయంపై మండిపాటు
ఈనాడు - దిల్లీ

దేశ రాజకీయాల్లో భారీ కుదుపు. సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడింది. ఆయనకు జైలు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు తీర్పు వెలువరించి 24 గంటలు కూడా గడవక ముందే.. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటిరోజు అని అభివర్ణించాయి. అయితే ఈ నిర్ణయాన్ని అధికార భాజపా గట్టిగా సమర్థించింది. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం (క్రిమినల్‌) కేసులో సూరత్‌ కోర్టు గురువారం రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం శుక్రవారం ఆగమేఘాలపై స్పందించింది. ఈ నెల 23 నుంచే రాహుల్‌ అనర్హత అమల్లోకి వచ్చినట్లు స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని అధికరణం 102(1)(ఇ), ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌సింగ్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనిపై పోరాడుతామని కాంగ్రెస్‌ స్పష్టంచేసింది. దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం సాయంత్రం విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి డీఎంకే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, జేడీయూ, సీపీఎం, ఎస్‌పీ, ఎస్‌ఎస్‌, ఐయూఎంల్‌, ఆప్‌, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, వీసీకేలకు చెందిన సీనియర్‌ నేతలు హాజరయ్యారు. మరోవైపు రాహుల్‌పై వేటును భాజపా సమర్థించింది. ఇది చట్టబద్ధ నిర్ణయమేనని స్పష్టంచేసింది. ఇటీవల యూపీలో భాజపా ఎమ్మెల్యేపైనా ఇదే రీతిలో అనర్హత వేటు పడిందని పేర్కొంది. అనర్హత నిర్ణయం వెలువడటానికి కొద్దిగంటల ముందు రాహుల్‌.. శుక్రవారం ఉదయం లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన కాంగ్రెస్‌ ఎంపీల భేటీలోనూ పాల్గొన్నారు.  

నాడు నానమ్మ..

రాహుల్‌ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆమెను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హురాలిగా ప్రకటించడంతోపాటు, ఆరేళ్లు ఎన్నికల్లో పోటీచేయకూడదని అలహాబాద్‌ హైకోర్టు 1975 జూన్‌ 12న తీర్పు ఇచ్చింది. అది దేశంలో అత్యవసర పరిస్థితికి దారితీసింది. ఇందిరాగాంధీ 1971  ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ నేత రాజ్‌నారాయణ్‌పై గెలిచారు.  అప్పట్లో ఆమె ఏజెంటుగా ఉన్న యశ్‌పాల్‌ కపూర్‌ ప్రభుత్వ ఉద్యోగి అని ఆయన పేర్కొన్నారు. ప్రధానిగా ఉన్న ఇందిర.. ప్రభుత్వ ఉద్యోగులను వ్యక్తిగత ఎన్నికల కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ ఆమె ఎన్నికను కోర్టులో సవాల్‌చేశారు. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్రువీకరిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దాంతో ఆమె జూన్‌ 25న దేశంలో అత్యవసర పరిస్థితి విధించి మొత్తం వ్యవస్థలను తన గుప్పిట్లోకి తీసుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ తరఫున ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొరార్జీదేశాయ్‌.. ఇందిరపై చర్యలకు ఉపక్రమించారు. పదేపదే సభాహక్కులను ఉల్లంఘిస్తున్నారని, సభాధిక్కరణకు పాల్పడుతున్నారంటూ ఆమెపై బహిష్కరణ వేటు వేయడంతోపాటు జైలుశిక్ష విధించారు. 1978 డిసెంబరు 20న లోక్‌సభ ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సభ ప్రొరోగ్‌ అయ్యేంతవరకూ ఇందిరను నిర్బంధంలో ఉంచాలని సభ నిర్దేశించింది. సభాహక్కుల ఉల్లంఘన, సభాధిక్కార నేరం కింద ఒక ఎంపీకి జైలుశిక్ష విధించడం అదే తొలిసారి. దీనిపై  దేశవ్యాప్తంగా నిరసనలతో డిసెంబరు 26న ఆమెను నిర్బంధం నుంచి విడుదల చేశారు.

త్రుటిలో తప్పించుకున్న సోనియా

రాహుల్‌ తల్లి, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గతంలో ఒకసారి అనర్హత వేటు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవిని చేపట్టినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం 2006 మార్చి 17న అనర్హత వేటు వేశారు. యూపీ కాంగ్రెస్‌ నాయకుడు మదన్‌మోహన్‌ ఫిర్యాదు మేరకు ఈసీ ఆ నిర్ణయం తీసుకొంది. ఆ ఉదంతం తర్వాత నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌ పదవి కూడా లాభదాయక పదవి కిందికి వస్తుందని, ఆ హోదాలో ఉన్న సోనియాపై కూడా అనర్హత వేటువేయాలన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అనర్హత వేటు నుంచి ఆమెకు రక్షణ కల్పిస్తూ ఆ హోదాను లాభదాయక పదవుల నుంచి తప్పిస్తూ ఆర్డినెన్స్‌ జారీచేయడానికి కేంద్రం సిద్ధమైందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన సోనియా.. 2006 మార్చి 23న తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లారు. లేకుంటే ఆర్టికల్‌ 102 కింద ఆమెపై అనర్హత వేటు పడి ఉండేదే.


2004 నుంచి పార్లమెంటుకు

రాహుల్‌ 2004 నుంచి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. 14, 15, 16 లోక్‌సభల్లో యూపీలోని అమేఠీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో అమేఠీతోపాటు కేరళలోని వయనాడ్‌  నుంచి పోటీచేశారు. అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన ఆయన వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచారు.

1970 జూన్‌ 19న జన్మించిన రాహుల్‌.. ఎన్‌ఎస్‌యూఐ, ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రధాని మోదీ.. దేశ సంపదను అదానీ సంస్థలకు కట్టబెట్టారని గత నెల 7న లోక్‌సభలో ఆరోపించారు. ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు లండన్‌ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలంటూ అధికారపక్ష సభ్యులు పార్లమెంటులో డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి ప్రతిగా విపక్షాలు అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటుచేయాలని ఆందోళనకు దిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్‌ అనర్హత వేటుకు గురికావాల్సి వచ్చింది.


ఏమిటీ నిబంధన?

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3) ప్రకారం ఏదైనా నేరంలో చట్టసభ సభ్యుడికి రెండేళ్లకు తక్కువ కాకుండా శిక్షపడితే.. ఆ తీర్పు వచ్చిన రోజు నుంచే అనర్హత అమల్లోకి వస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికీ వీలుండదు. కిందికోర్టు తీర్పుపై ఉన్నత కోర్టులు స్టే ఇవ్వడం, రద్దుచేయడం లేదంటే శిక్షాకాలాన్ని రెండేళ్లకంటే తక్కువకు కుదిస్తే తప్పితే అనర్హత వేటు నుంచి తప్పించుకొనే పరిస్థితి ఉండదు. రాహుల్‌కు ఉపశమనం లభించకుంటే మొత్తం ఎనిమిదేళ్ల పాటు ప్రజాప్రతినిధి జీవితానికి ఆయన దూరం కావాల్సి ఉంటుంది.

నాడు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించకుంటే..

కింది కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ పైకోర్టులో అప్పీల్‌ చేయడానికి వీలుగా ‘ఆటోమేటిక్‌ సస్పెన్షన్‌’ నిబంధన 3 నెలల వరకు అమల్లోకి రాకూడదని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(4)లో ఉండేది. ఈ నిబంధనను 2013 జులై 10న సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే ప్రజాప్రతినిధుల కేసులు ఎగువ కోర్టులో పెండింగ్‌లో ఉండగా వారిపై అనర్హత వేటు వేయడానికి వీల్లేదంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013 ఆగస్టులో ప్రజాప్రాతినిధ్య చట్టం (రెండో సవరణ)బిల్లును తెచ్చింది. అది సభామోదం పొందకపోవడంతో దాణా కేసులో యూపీఏ భాగస్వామి లాలూ ప్రసాద్‌ను రక్షించడానికి కేంద్రం 2013 సెప్టెంబరు 24న ఆర్డినెన్స్‌ జారీచేసింది. జైలుశిక్ష పడ్డ నేతలపై తక్షణం అనర్హత వేటు పడకుండా చూసేందుకు ఈ చర్య చేపట్టింది. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో 2013 సెప్టెంబర్‌ 27న రాహుల్‌ విలేకర్ల సమావేశంలో ఆ ఆర్డినెన్స్‌ ప్రతులను చించేశారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం దాని జోలికి పోలేదు. దీంతో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా.. శిక్షపడిన ప్రజాప్రతినిధులపై ‘ఆటోమేటిక్‌గా అనర్హత’  అమల్లోకి వచ్చింది. నాటి ఆర్డినెన్స్‌ను రాహుల్‌ వ్యతిరేకించకుంటే.. ప్రభుత్వం దాన్ని కొనసాగించి ఉండేది. అదే జరిగిఉంటే రాహుల్‌పై ఇప్పుడు తక్షణం అనర్హత వేటు పడి ఉండేది కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


దేశం కోసం ఎంత మూల్యమైనా చెల్లిస్తా

భారత ప్రజల వాణిని వినిపించేందుకు పోరాడుతున్నాను. ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.

అనర్హత వేటు తర్వాత రాహుల్‌ గాంధీ ట్వీట్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని