ఎర్ర గీత దాటారని తెదేపా సభ్యుల సస్పెన్షన్‌

జీవో-1 రద్దుకు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టి స్పీకర్‌ పోడియం ముందున్న ఎర్రగీతను దాటి వెళ్లి నిరసన తెలిపినందుకు తెలుగుదేశం శాసనసభ్యులు ఒకరోజు సస్పెన్షన్‌కు గురయ్యారు.

Published : 25 Mar 2023 05:06 IST

జీవో-1 రద్దు వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించని సభాపతి
పోడియం ముందు తెదేపా నిరసన
గీత దాటారంటూ ఒక రోజు సస్పెన్షన్‌

ఈనాడు, అమరావతి: జీవో-1 రద్దుకు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టి స్పీకర్‌ పోడియం ముందున్న ఎర్రగీతను దాటి వెళ్లి నిరసన తెలిపినందుకు తెలుగుదేశం శాసనసభ్యులు ఒకరోజు సస్పెన్షన్‌కు గురయ్యారు. శాసనసభ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగానే జీవో-1 రద్దుకు తాము ఇచ్చిన తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని తెదేపా సభ్యులు డిమాండ్‌ చేశారు. చర్చ చేపట్టాలని తమ సీట్లలోనే నిలబడి పట్టుబట్టారు. కూర్చోవాలని సభాపతి తమ్మినేని సీతారాం సూచించినా.. ఇది ప్రాధాన్య అంశమని, దీన్ని ముందుగా చర్చకు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై అభిప్రాయం చెబుతానంటూ సభాపతి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో తెదేపా సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లారు. పోడియం ముందు గీసిన ఎర్రగీత దాటొద్దంటూ సభాపతి వారికి సూచించారు. కొంత సమయం గీతకు అవతల నిలబడి తెదేపా సభ్యులు నిరసన తెలిపారు. సభాపతి దగ్గరుండి చట్టసభలోనే తమను కొట్టించారని తెదేపా శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. జీవో-1 రద్దు చేయాలని, నియంతృత్వ ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో ఒక్కసారిగా తెదేపా సభ్యులు ఎర్ర గీతను దాటి, పోడియం ముందుకు వచ్చారు. సభా నిబంధనల ప్రకారం ఎర్రగీతను దాటినందున తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్‌రావు, వెలగపూడి రామకృష్ణ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, గణబాబులను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. సభలోకి మార్షల్స్‌ రావడంతో తెదేపా ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇది శాసనసభలా లేదని, సంతాపసభలా ఉందంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా గెలవడం దేవుడి స్క్రిప్టు అంటూ వ్యాఖ్యానిస్తూ మరికొంత మంది సభ్యులు బయటికి వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు