పోలవరం ఎత్తు తగ్గించొద్దు: సీపీఐ

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించకుండా 45.72 మీటర్ల ఎత్తుతోనే పూర్తిస్థాయిలో నిర్మించాలని సీపీఐ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది.

Published : 25 Mar 2023 05:06 IST

గవర్నర్‌పేట (విజయవాడ), న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించకుండా 45.72 మీటర్ల ఎత్తుతోనే పూర్తిస్థాయిలో నిర్మించాలని సీపీఐ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. ఈ ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం 41.15 మీటర్ల ఎత్తు వరకేనంటూ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ పార్లమెంటులో చేసిన ప్రకటనను ఖండించింది. ఈ సమస్యపై సీపీఐ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సామూహిక దీక్షలు చేయనున్నట్లు తెలిపింది. విజయవాడ దాసరిభవన్‌లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకూడదని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మొదటి దశ పేరుతో 41.15 మీటర్లకు ఎత్తు తగ్గిస్తే పోలవరం జాతీయ ప్రాజెక్టు కాస్త మినీ ప్రాజెక్టుగా మారుతుందన్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 196.60 టీఎంసీల నుంచి 92 టీఎంసీలకే పరిమితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరిగితే 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని, ముఖ్యమంత్రి తక్షణం చొరవ తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. పార్టీ నేత పి.రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రావుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు