జీవో నంబర్‌-1పై చర్చకు తెదేపా ఎమ్మెల్సీల పట్టు

జీవో నంబర్‌-1ను రద్దుచేయాలంటూ శాసనమండలిలో రెండో రోజు కూడా ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.

Published : 25 Mar 2023 05:06 IST

అనుమతించకపోవడంతో  సభ నుంచి వాకౌట్‌
పదవీ కాలం ముగియనున్న మండలి సభ్యులను సత్కరించిన ఛైర్మన్‌

ఈనాడు, అమరావతి: జీవో నంబర్‌-1ను రద్దుచేయాలంటూ శాసనమండలిలో రెండో రోజు కూడా ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. శుక్రవారం ఉదయం 10.02 గంటలకు సభ ప్రారంభం కాగానే జీవో-1పై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని తెదేపా సభ్యులు కోరారు. దీనిని ఛైర్మన్‌ మోషేనురాజు తిరస్కరించడంతో వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ అంశంపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఇదేమీ పట్టించుకోకుండా ఛైర్మన్‌ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో.. ‘ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగించే జీవోను రద్దు చేయాలి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్‌ నుంచి మంత్రులు కోలుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత మాట్లాడటానికి అవకాశం కల్పిస్తానని ఛైర్మన్‌ చెప్పగా ఇప్పుడే చర్చకు అనుమతించాలని తెదేపా ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దీనికి ఛైర్మన్‌ అంగీకరించకపోవడంతో ఉదయ 10.23 గంటలకు సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఎవరో షాక్‌లో ఉన్నారంటున్నారు.. మీరే షాక్‌లో ఉన్నట్లున్నారని తెదేపా సభ్యులనుద్దేశించి ఛైర్మన్‌ వ్యాఖ్యానించారు. తెదేపా సభ్యులు వాకౌట్‌ చేస్తుంటే.. మంత్రి అంబటి రాంబాబు జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. ‘ప్రశ్నోత్తరాలు పూర్తయిన తర్వాత మాట్లాడటానికి అవకాశం ఇస్తానని మీరు అన్నారు. జీవో నం-1 గురించి వారు మాట్లాడితే.. మేం చాలా మాట్లాడతాం. చంద్రబాబు బహిరంగ సభల వల్ల ఎంత మంది చనిపోయారో? ఆ విషయాలు మాట్లాడితే వారు తలదించుకోవాలి. అందుకే ముందుగా వెళ్లిపోయారు’ అని విమర్శించారు. తర్వాత ప్రశ్నోత్తరాలు.. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు.. మొత్తం 12 బిల్లులను మండలి ఆమోదించింది. అనంతరం 21 మంది సభ్యుల పదవీ కాలం పూర్తి కానుందని (మళ్లీ సమావేశాలు నిర్వహించేటప్పటికి వారి పదవీ కాలం పూర్తవుతుంది), వచ్చే సమావేశాలకు వారు హాజరయ్యే అవకాశం లేనందున వారిని సత్కరించాలని నిర్ణయించినట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. దీనికి ఛాంబర్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనిపై భాజపా ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పదవీ కాలం పూర్తయిన సభ్యుల అనుభవాలను సభలో చెప్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పదవీ కాలం పూర్తికానున్న సభ్యుల్లో అందుబాటులో ఉన్న వారితో సభలో మాట్లాడించిన తర్వాత.. వారితో ఉన్న అనుభవాన్ని ఇతర సభ్యులు పంచుకున్నారు. మండలి సమావేశాలు మొత్తం 8 రోజులు.. 28.57 గంటలు కొనసాగాయని.. 27 బిల్లులను ఆమోదించినట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. 66 స్టార్డ్‌ ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు, ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ, 8 వాయిదా తీర్మానాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. సాయంత్రం 5.37 గంటలకు మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం పదవీకాలం పూర్తికానున్న మండలి సభ్యుల్లో అందుబాటులో ఉన్న వారిని ఛైర్మన్‌ మోషేనురాజు సత్కరించారు.


తెలుగు విశ్వవిద్యాలయం గురించి పట్టదా?

గిరిజన విశ్వవిద్యాలయ పనుల పురోగతిపై శుక్రవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. అనంతరం జరిగిన చర్చలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘తెలుగు విశ్వవిద్యాలయం గురించి పట్టించుకున్న వారే లేరు? రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న తెలుగు వర్సిటీలో మనకు రావాల్సిన వాటి గురించి కమిటీ ఏర్పాటు చేశారు. మనకు సంబంధించిన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలను గుర్తించారు. అక్కడి నుంచి వాటిని లారీల్లో తేవాలి. దీని గురించి పదేళ్లుగా పట్టించుకోవడం లేదు. రాజమహేంద్రవరంలోని బొమ్మూరు సమీపంలో శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీకి చెందిన స్థలం ఉంది. అక్కడే తెలుగు విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనను పరిశీలించాలి’’ అని సూచించారు.


చట్టంలో మార్పులపై అధ్యయన కమిటీ

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక(వనరుల వినియోగం, ప్రణాళిక) (సవరణ) బిల్లు- 2023పై జరిగిన చర్చలో భాగంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అధ్యయనానికి 17 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ చట్టంలో తేవాల్సిన మార్పుల గురించి అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. దీనిపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. కమిటీ వేసిన విషయమే తాము ఇప్పుడు వింటున్నామని.. ఇందులో ఆయా వర్గాల సమస్యలపై అధ్యయనం చేసిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. మరో ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఆయా వర్గాల సమస్యలపై అధ్యయనం చేసిన వారికి కమిటీలో ప్రాతినిధ్యం లేకుండా ఎమ్మెల్యేలు, అధికారులతో కమిటీ వేసుకుని ఉపయోగం ఏంటి? పౌర సమాజానికి ప్రాతినిధ్యం కల్పించాలి’’ అని పేర్కొన్నారు.


ఓట్ల కోసం పథకాలు పెట్టడం భావ్యం కాదు

రాష్ట్రంలోని పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు నెలవారీగా ప్రభుత్వం అందించే గౌరవ వేతనంపై వైకాపా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నపై ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా సమాధానం ఇచ్చారు. అనంతరం దీనిపై జరిగిన చర్చలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగానికి మతం లేదు. లౌకికవాద రాజ్యాంగం మనది. అలాంటప్పుడు ఇమామ్‌లు, పాస్టర్లు, పూజారులకు నెలనెలా డబ్బులు ఇచ్చే పథకం పెట్టడం ఏంటి? ఓట్ల కోసం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు’’ అని పేర్కొన్నారు. ఇదే అంశంపై భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ.. ‘ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆస్కారం కల్పించేలా ఒక విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఇది రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి’ అని కోరారు.


12 బిల్లులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయాల బిల్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ (ఆర్థిక వనరుల వినియోగం, కేటాయింపు, ప్రణాళిక) (సవరణ) బిల్లు, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ (సవరణ) బిల్లు, పౌర సేవల వినిమయ (సవరణ) బిల్లు, మున్సిపల్‌ చట్టాల (సవరణ) బిల్లు, మున్సిపల్‌ చట్టాల (రెండో సవరణ) బిల్లు, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ (సవరణ) బిల్లు, మహిళా కమిషన్‌ (సవరణ) బిల్లు, ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ (సవరణ) బిల్లు, ఏపీ లోకాయుక్త (సవరణ) బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు(నంబర్‌ 2)-2023 లను మండలి ఆమోదించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని