సంక్షిప్త వార్తలు (11)

లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Updated : 26 Mar 2023 06:22 IST

రాహుల్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: పోచారం

బాన్సువాడ, న్యూస్‌టుడే: లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పోచారం విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్‌పై అనర్హత వేటును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శిక్ష అమలయ్యే కంటే ముందే అనర్హత వేటు ప్రకటించారని, తక్షణమే దాన్ని ఎత్తివేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై మాట్లాడుతూ.. నిందితులను పట్టుకున్నారని, దోషులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందన్నారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అభాసుపాలు చేయడానికి విపక్ష పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


లోక్‌సభ సెక్రటేరియట్‌ నిర్ణయం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం: కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌ తన పరిధిని మించి నిర్ణయం తీసుకుందని ఆయన ఆక్షేపించారు. ‘రాజకీయ నాయకులు విమర్శలు, దూషణలు చేసుకోవడం సహజం. ఆ విషయాన్ని నేరంగా చూసి శిక్ష వేస్తే నాయకులందరు అనర్హత వేటులో చిక్కుకుంటారు. న్యాయస్థానం వేసిన శిక్ష అమల్లోకి రాకముందే వేటు వేయడం సరికాదు. అదానీ ఉదంతం సహా అనేక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో దానికి ఆటంకం కలిగేలా కేంద్రం తొందరపాటు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి’ అని కోదండరాం డిమాండ్‌ చేశారు.


రాహుల్‌పై అనర్హత వేటు తగదు: వైఎస్‌ షర్మిల

ఫిలింనగర్‌ న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఖండించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. అప్పీలుకు 30 రోజుల సమయం ఉన్నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్యే. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం అంతే ప్రధానం’ అని అన్నారు. భాజపా చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందని షర్మిల పేర్కొన్నారు.  


విద్యుత్తు ఉద్యోగుల ఐకాసతో సీఎం చర్చించాలి: తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్న విద్యుత్తు ఉద్యోగుల్ని, కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఓ ప్రకటనలో ఆక్షేపించారు. వెంటనే విద్యుత్‌ ఉద్యోగుల ఐకాసతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చలు జరిపి వారి సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ‘వేతన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయడంతో పాటు ఆర్టిజన్లుగా ఉన్నవారిని కన్వర్షన్‌ చేయాలి. కనీసం 30 శాతం వారికి ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. 20 ఏళ్లుగా సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న రెవెన్యూ క్యాషియర్లు, స్పాట్‌ బిల్లింగ్‌, ఇతర కార్మికుల్ని ఆర్టిజన్లుగా గుర్తించాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు.కేంద్రంలో మోదీ ప్రభుత్వ నిరంకుశ, ఫాసిస్టు పాలనతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిలదీస్తుంటే ఆ విషయం నుంచి దృష్టి మళ్లించేందుకు రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆయన మండిపడ్డారు.


కర్ణాటక ఎన్నికలకు కాంగ్రెస్‌ తొలి జాబితా

ఈనాడు, బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ అధినాయకత్వం శనివారం విడుదల చేసింది. మొత్తం 224 నియోజకవర్గాల్లో 124 మంది అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేశారు. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్‌ మునియప్ప వంటి ప్రముఖ నేతలు పోటీ చేసే స్థానాలు ప్రకటించారు. సిద్ధరామయ్య కోలార్‌, వరుణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ఏఐసీసీకి విన్నవించగా.. వరుణ నుంచి టికెట్‌ ఖరారు చేశారు. వరుణలో ప్రస్తుతం సిద్ధు కుమారుడు యతీంద్ర ఎమ్మెల్యేగా ఉన్నారు.


గొంతులేని వారి గళమవుదామనే రాజకీయాల్లోకి వచ్చా  
వరుణ్‌గాంధీ వ్యాఖ్య

పీలీభీత్‌: గొంతులేని వారి గళమవుదామనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ పేర్కొన్నారు. శనివారం పురాన్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత, మచ్చలేని వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని చెప్పారు. రాజకీయ నాయకులు గొంతులేనివారికి గళాలవ్వాలని సూచించారు.


కాంగ్రెస్‌ అతిపెద్ద ప్రతిపక్షమే కానీ... బలమున్నచోట ప్రాంతీయ పార్టీలకు సారథ్యం ఇవ్వాలి: తేజస్వీ

దిల్లీ: దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అని అంగీకరిస్తూనే...ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల సారథ్య బాధ్యతలు వాటికే అప్పగించాలని సూచించారు. 2024 సాధారణ ఎన్నికలకు ఈ విధమైన అవగాహనతో ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను, అన్ని ప్రాంతీయ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ‘‘బిహార్‌లోని మహాకూటమిలో కాంగ్రెస్‌ పార్టీ కూడా భాగస్వామే. ఆ రాష్ట్రంలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీ. అయితే, దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌. మేము గతంలోనూ స్పష్టంగా చెప్పాం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వాటికే కీలక బాధ్యతలు అప్పగించాలి. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు అర్థం చేసుకోవాలి. భాజపాతో ముఖాముఖీ పోరు ఉన్న స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయాలి. అలాంటి స్థానాలు 200 వరకు ఉంటాయి’ అని తేజస్వీ యాదవ్‌ తెలిపారు.


ఓబీసీ సమాజానికి క్షమాపణలు చెప్పాలనడం హాస్యాస్పదం: వీహెచ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఓబీసీ సమాజానికి రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌లు అనడం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సురేశ్‌ షెట్కర్‌ తదితరులతో కలిసి ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓబీసీలపై చిత్తశుద్ది ఉంటే బీసీ క్రీమిలేయర్‌ ఎందుకు ఎత్తేయలేదని, బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. శ్రీరామనవమి తర్వాత ఓబీసీల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తానని.. బండి సంజయ్‌, లక్ష్మణ్‌లు చర్చకు రావాలని సవాల్‌ చేశారు. ఓబీసీలపై ప్రేముంటే వారి సమస్యలను పరిష్కరించాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.


రాహుల్‌గాంధీ ఓబీసీలను కించపరిచారు: ఎంపీ మనోజ్‌తివారి

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ఓబీసీ కులాలను కించపరిచే విధంగా మాట్లాడారని భోజ్‌పురి నటుడు, ఎంపీ మనోజ్‌ తివారీ అన్నారు. విశాఖలోని భాజపా కార్యాలయంలో శనివారం ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ఆయన ఆలోచనా విధానాన్ని ప్రతి భారతీయుడు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. జి-20 సదస్సు విశాఖలో నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని భాజపా వ్యతిరేకిస్తుందన్నారు. క్రిస్టియన్‌, ముస్లిం మతాలకు ఎస్సీ హోదా కల్పించడం కుదరదని అన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు, భాజపా అధికార ప్రతినిధి సుహాసినీ ఆనంద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్‌ వర్మ పాల్గొన్నారు.


ఆహ్వానం పంపి అడ్డుకోవడమెందుకు?: ఎమ్మెల్సీ సాబ్జీ

ఏలూరు, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ దెందులూరు పర్యటనలో పాల్గొనేందుకు తనను ఆహ్వానించి ఆనక అడ్డుకున్నారని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ పేర్కొన్నారు. ఏలూరులో శనివారం ఆయన మాట్లాడారు. సీఎం కార్యక్రమానికి తనకు ఆహ్వాన పత్రం పంపారని, వేదికపైకి పిలిచే వీఐపీల జాబితాలోనూ తన పేరును పొందుపరిచారని తెలిపారు. అయితే పోలీసు అధికారులు పైనుంచి ఆదేశాలొచ్చాయని, సీఎం కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ శుక్రవారం రాత్రి నుంచి తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.


మోదీకి వ్యతిరేకంగా పోరాడదాం: గిడుగు రుద్రరాజు

విజయవాడ(గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు భాజపా నియంతృత్వానికి నిదర్శనమని, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడమే మోదీ విధానమని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఏపీసీసీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘రాహుల్‌తోనే మా పయనం’ అనే గోడపత్రిక ఆవిష్కరించారు. అనంతరం రుద్రరాజు విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీకి అండగా, మోదీ మోసాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీలతో పాటు నరేంద్ర మోదీపై 2019లో రాహుల్‌ గాంధీ చేసిన విమర్శల కేసును ఇప్పుడు కావాలనే బయటపెట్టారని ఆరోపించారు. రెండేళ్ల జైలు శిక్ష పడగానే ఆగమేఘాల మీద రాహుల్‌పై అనర్హత వేటు వేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని