రాహుల్‌కు మద్దతుగా నిరసనలు

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ దేశంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు శనివారం ఆందోళనలకు దిగాయి.

Published : 26 Mar 2023 03:38 IST

దిల్లీ, వయనాడ్‌, ఠాణే, పుణె, గువాహటి: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ దేశంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు శనివారం ఆందోళనలకు దిగాయి. దేశ రాజధాని దిల్లీలో యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు రాహుల్‌ గాంధీ మాస్కులను ధరించి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంవద్ద నిరసన తెలియజేశారు. ‘భయం లేదు, నిజమైన గాంధీ సత్యం కోసం పోరాడుతూనే ఉంటాడు’ అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. చండీగఢ్‌లో దిల్లీకి వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలును స్థానిక యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన ఇప్పటిదాకా ప్రాతినిధ్యం వహించిన వయనాడ్‌లో భారీ ఆందోళనలు జరిగాయి. ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వ్యాన్లతో తరలించారు. అంతకుముందు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ కొచ్చిలో విలేకరులతో మాట్లాడారు. యూడీఎఫ్‌ భాగస్వాములంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని తెలిపారు. ఈ నెల 27న కేరళ రాజ్‌భవన్‌కు మార్చ్‌ నిర్వహిస్తామని చెప్పారు.

* మహారాష్ట్రలోని నాసిక్‌లో అంబేడ్కర్‌ విగ్రహంవద్ద కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఠాణేలోనూ కాంగ్రెస్‌ ఆందోళనలు నిర్వహించింది. ప్రతిగా రాహుల్‌ వ్యాఖ్యలపై భాజపా శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశాయి. పుణెలోని ఎంజీ రోడ్డులో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. రాహుల్‌ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ జరిపారు.

మహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘాడీ కూటమి సభ్యులంతా అసెంబ్లీ ఎదుట తమ నోటికి నల్ల వస్త్రాన్ని కట్టుకుని... ‘ప్రజాస్వామ్యానికి మరణం’ అని రాసి ఉన్న ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. ఆదిత్య ఠాక్రే నిరసనలో పాల్గొన్నారు.

* అస్సాంలోని గువాహటిలోనూ కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి. పోలీసు బారికేడ్లను ఛేదించుకుని రాష్ట్ర సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

* మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమ నోటికి తాళాలు వేసుకుని శాంతియుతంగా నిరసనలో పాల్గొన్నారు.

* ఝార్ఖండ్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు.


నేడు కాంగ్రెస్‌ సత్యాగ్రహం

దిల్లీ: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా కేంద్రాలన్నింటిలో గాంధీ విగ్రహాల ఎదుట రోజంతా సత్యాగ్రహం చేయనుంది. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ దీక్ష సాయంత్రం 5 గంటలవరకూ సాగనుంది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌వద్ద కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సత్యాగ్రహంలో పాల్గొంటారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని