తాటాకు చప్పుళ్లకు రాహుల్‌ భయపడరు

ప్రధాని మోదీ తాటాకు చప్పుళ్లకు రాహుల్‌గాంధీ భయపడరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కుమురం భీం జిల్లాలో సాగుతున్న ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ పాదయాత్ర శనివారం ఆసిఫాబాద్‌ చేరుకుంది.

Published : 26 Mar 2023 03:38 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: ప్రధాని మోదీ తాటాకు చప్పుళ్లకు రాహుల్‌గాంధీ భయపడరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కుమురం భీం జిల్లాలో సాగుతున్న ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ పాదయాత్ర శనివారం ఆసిఫాబాద్‌ చేరుకుంది. స్థానిక ప్రేమలా గార్డెన్‌ వద్ద నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి విక్రమార్క ప్రసంగించారు. దేశప్రజల కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ పాదయాత్ర చేసి, భాజపా అక్రమాలను బయటపెట్టారన్నారు. లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ, అదానీల సంపద దోపిడీకి రాహుల్‌ అడ్డుపడుతున్నారనే అక్కసుతో కుట్రపూరితంగా గుజరాత్‌లో కేసు పెట్టి జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

పాదయాత్రలో బయటపడ్డ వర్గ విభేదాలు

ఆసిఫాబాద్‌లో భట్టి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, పార్టీ జిల్లాఅధ్యక్షుడు విశ్వప్రసాద్‌ వర్గాల మధ్య తోపులాట జరిగింది. విశ్వప్రసాద్‌ వర్గం అంబేడ్కర్‌ విగ్రహంవద్ద సభ ఏర్పాటుచేయగా, పట్టణంలోని ప్రమీలా గార్డెన్‌ పక్కన ప్రేంసాగర్‌రావు వర్గం ఏర్పాటు చేసింది. జిల్లా అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండానే వేదికను ఏర్పాటు చేశారనే ఆరోపణలతో వివాదం మొదలైంది. ఇరువర్గాలవారు అరకిలోమీటరు వరకు తోసుకుంటూ ముందుకు వెళ్లారు.  అనంతరం ప్రేంసాగర్‌రావు సభలో మాట్లాడుతూ కన్నీరు పెటుకున్నారు. ఎవరి మద్దతున్నా లేకున్నా, ఆసిఫాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించి తీరుతానన్నారు. అనంతరం రాహుల్‌ సభ్యత్వ రద్దుకు నిరసనగా భట్టి కాగడాలతో ర్యాలీ చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు