భాజపా నియంతృత్వ పాలనపై ఉద్ధృత పోరాటం

ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.

Updated : 26 Mar 2023 06:15 IST

రాష్ట్ర నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచన

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ, భాజపాల అప్రజాస్వామిక రాజకీయ విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటం మరింత ఉద్ధృతం చేయాలని సూచించారు. కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ వెళ్తూ.. ఖర్గే, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు గంటపాటు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆగారు. వారికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, ఇతర నాయకులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో ఖర్గే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాహుల్‌ గాంధీపై భాజపా, మోదీ రాజకీయ కక్షసాధింపు చర్యలను ఎలా ఎదుర్కోవాలి, తెలంగాణలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతులను మోదీ సర్కార్‌ అణచివేస్తోందని ఖర్గే విమర్శించారు. మోదీ నియంతృత్వ, నిరంకుశ పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి అంశాన్నీ ఉపయోగించుకోవాలని సూచించారు. రేవంత్‌రెడ్డి హాథ్‌సే హాథ్‌ జోడో పాదయాత్రపై ఆయన ఆరా తీశారు. ఇప్పటివరకు 31 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినట్లు రేవంత్‌ తెలిపారు.

గాంధీభవన్‌లో నేడు కాంగ్రెస్‌ నిరసన దీక్ష

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్యాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం గాంధీభవన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో, ఇందిరాభవన్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల సమావేశంలోనూ, శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఆయన మాట్లాడారు. భారత్‌ జోడో యాత్రలో ప్రజలతో మమేకం అవడం, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని పార్లమెంట్‌లో పట్టుపట్టడంతో రాహుల్‌పై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. మోదీ, భాజపాల ప్రజావ్యతిరేక విధానాలు, అదానీ వ్యవహారంపై పార్లమెంటు వేదికగా పదే పదే ప్రశ్నిస్తున్నందుకే రాహుల్‌పై కుట్రపూరితంగా వేటు వేశారని మండిపడ్డారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్‌, పొన్నాల, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సమావేశమై రాహుల్‌పై వేటు నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు