నేడు మహారాష్ట్రలో భారాస రెండో బహిరంగ సభ

భారత్‌ రాష్ట్ర సమితి(భారాస) ఆదివారం మహారాష్ట్రలోని లోహ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభను నిర్వహించనుంది. భారాస ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో నిర్వహిస్తున్న రెండో సభ ఇది.

Published : 26 Mar 2023 03:38 IST

లోహలో నిర్వహణ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌
భారీ జనసమీకరణకు సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి(భారాస) ఆదివారం మహారాష్ట్రలోని లోహ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభను నిర్వహించనుంది. భారాస ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో నిర్వహిస్తున్న రెండో సభ ఇది. పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ప్రవాస తెలంగాణ వాసులు అధికంగా ఉన్న నాందేడ్‌ జిల్లాలో ఏర్పాటుచేసిన ఈ సభకు జనం అధికసంఖ్యలో హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. భారాసను అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల్లోని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని భాజపా, ఎన్సీపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీల నాయకులతో పాటు ఛత్రపతి శివాజీ వారసులైన నేతలు సైతం ముందుకొచ్చారు. తెలంగాణ శివారులోని మహారాష్ట్ర గ్రామాల ప్రజలు తెలంగాణ ప్రభుత్వ పథకాల అమలును కోరుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోనికి తీసుకొని కేసీఆర్‌ మొదట మహారాష్ట్రలో పార్టీ కార్యక్రమాల విస్తరణకు నిర్ణయించారు. గత నెల 5న నాందేడ్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మొదటి బహిరంగ సభకు స్పందన రావడంతో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయించారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉన్న నాందేడ్‌తో పాటు ఠాణె, అహ్మద్‌నగర్‌, శిర్డీ, బృహన్‌ముంబై తదితర కార్పొరేషన్లలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో పోటీకి సన్నద్ధమవుతున్న భారాస.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో తన అనుచరులతో కేసీఆర్‌ను కలిసిన లోహ మాజీ ఎమ్మెల్యే, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) కిసాన్‌ సెల్‌ నేత శంకర్‌గణేశ్‌రావు ధోంగె తమ వద్ద సభ నిర్వహించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భారాస నేతలు పది రోజులుగా అక్కడే ఉండి సభ ఏర్పాట్లు చేశారు.

కేసీఆర్‌ ప్రసంగంపై ఉత్కంఠ

సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి లోహకు చేరుకుంటారు. మూడు గంటలకు స్థానిక నేతలతో సమావేశమై 4 గంటలకు సభలో ప్రసంగిస్తారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు సీఎం సమక్షంలో భారాసలో చేరతారు. ఇటీవల ఎమ్మెల్సీ కె.కవితను ఈడీ రెండు దఫాలుగా విచారణకు పిలిచింది. తాజాగా కేంద్రం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడంపైనా కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ ప్రసంగం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కాంగ్రెస్‌పై భారాస వైఖరిని కూడా వెల్లడించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని