నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 26 Mar 2023 03:38 IST

నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
మహాధర్నాలో బండి సంజయ్‌

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేసేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. భాజపా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మద్దతుగా శనివారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీకేజీలో ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉందని మంత్రి కేటీఆర్‌ ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఆ తర్వాత 11 మందిని ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన కళాకారులు, మేధావులు, విద్యావంతులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? వారు నిరుద్యోగులతో కలసి ముందుకు రావాలి. మరోసారి మిలియన్‌ మార్చ్‌ నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు. లీకేజీపై సిట్‌ వేశారని.. నయీం ఉదంతంలో వేసిన విచారణ బృందం ఏం చేసిందని ప్రశ్నించారు. నయీం నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో భారాసను ఓడించి భాజపా గద్దెనెక్కుతుందని, అప్పుడు నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఏటా ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. లీకేజీపై పార్టీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని, పాత పది జిల్లాల పరిధిలో వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ వరకు నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే, తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామన్నారు.

ఒప్పంద ఉద్యోగాలే ఎక్కువయ్యాయి: ఈటల

తెలంగాణ రాకముందు ఒప్పంద, పొరుగు సేవల విధానాన్ని రద్దు చేసి అందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పిన కేసీఆర్‌.. అధికారంలో ఉండి అదే విధానాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. 1.90 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం శాసనసభలో ప్రకటించినా ఆచరణలో చూపలేదని, గత నాలుగున్నరేళ్ల కాలంలో కేవలం 11 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. విజయశాంతి మాట్లాడుతూ.. తప్పు చేసింది ప్రభుత్వంలోని వారైతే, ప్రతిపక్ష నాయకులకు సిట్‌ నోటీసులు జారీ చేస్తోందని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీకి కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ సిట్‌ అధికారులు ముందుగా సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని, ఇతరులను ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మాజీ ఎంపీలు వివేక్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన ఎ.వి.ఎన్‌.రెడ్డి, మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తూనే మరోవైపు కేసులు ప్రభుత్వమే వేయిస్తూ నిరుద్యోగ యువతను మోసగిస్తోందని ఆరోపించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. ప్రభాకర్‌, ఇంద్రసేనారెడ్డి, మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని