వైకాపా పాలనలో మహిళలకు భద్రత కరవు

వైకాపా పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని భాజపా మహిళా మోర్చా విమర్శించింది.

Published : 26 Mar 2023 04:39 IST

భాజపా మహిళా మోర్చా

రాజమహేంద్రవరం (దేవీచౌక్‌): వైకాపా పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని భాజపా మహిళా మోర్చా విమర్శించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని భాజపా జిల్లా కార్యాలయంలో శనివారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌, రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్‌లు మాట్లాడుతూ.. వైకాపా మూడేళ్ల పాలనలో సుమారు వెయ్యిమందికి పైగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయన్నారు. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మహిళలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియోలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయని గుర్తుచేశారు. బెల్టుషాపులను మూసివేస్తామని చెప్పి మద్యాన్ని ప్రతీ గుమ్మంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళా మోర్చా రాష్ట్రంలోని మహిళలు, వారి గౌరవానికి అండగా నిలుస్తుందన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, శరణాల మాలతీరాణి, ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌, సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్‌, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీ కేసుతో భాజపాకు సంబంధం లేదు

అంతకుముందు వానతి శ్రీనివాసన్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేసుతో భాజపాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తే దానికి భాజపాదే బాధ్యత అన్నట్లు విమర్శించడం దారుణమన్నారు.

27న గవర్నర్‌ను కలుస్తాం : సోము వీర్రాజు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విలేకర్లతో మాట్లాడుతూ... దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది మత మార్పిడులను ప్రోత్సహించడమేనని విమర్శించారు. దీనిపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. ఈ తీర్మానాన్ని సీఎం ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. దీనిపై 27న గవర్నర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు