రాహుల్‌పై అనర్హత వేటు భాజపా స్వీయ తప్పిదం: థరూర్‌

తమ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసి భాజపా స్వీయ తప్పిదం చేసుకున్నట్లయిందని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యానించారు.

Published : 26 Mar 2023 04:37 IST

తిరువనంతపురం: తమ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసి భాజపా స్వీయ తప్పిదం చేసుకున్నట్లయిందని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. ఈ చర్య చివరకు విపక్షాలకు, రాహుల్‌కు లబ్ధి కలిగిస్తుందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన అభిప్రాయపడ్డారు. అనర్హత విషయంలో గంటల వ్యవధిలో లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు. దీని పరిణామాలను భాజపా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. అంటీముట్టనట్లు ఉండే విపక్షాలన్నీ రాహుల్‌గాంధీ ఉదంతంతో ఏకమయ్యాయనీ, తమతమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు సైతం రాహుల్‌పై అనర్హత వేటును ముక్తకంఠంతో ఖండించాయని థరూర్‌ అన్నారు. అప్పీలుకు వెళ్లేందుకు గడువు ఉన్నా, ఆగమేఘాలపై లోక్‌సభ సచివాలయం స్పందించి, అనర్హత వేటు వేయడాన్ని తప్పుబట్టారు. మరికొందరు నేతలు కూడా ఈ అంశంపై స్పందించారు...


దీని కోసమా మా తాత జైలుకెళ్లింది..?

రాహుల్‌ గాంధీపై వేటు వేయడం.. గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుంది. మా తాతయ్య (అమర్‌నాథ్‌ విద్యాలంకార్‌, స్వాతంత్య్ర సమరయోధుడు) ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు (ప్రధాని మోదీకి) ఉంది.

రో ఖన్నా, అమెరికా చట్టసభ సభ్యుడు


ఓబీసీలకు అవమానం అనడం అర్థరహితం

రాహుల్‌ తన వ్యాఖ్యలతో ఓబీసీలను అవమానపరిచారని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర  ప్రధాన్‌, అనురాగ్‌ ఠాకుర్‌ చెప్పడం అర్థరహితం. వీటిద్వారా ప్రజల వివేకాన్ని వారు అవమానపరుస్తున్నారు.

కపిల్‌ సిబల్‌, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి


వేటు వెనుక మోదీ సర్కారు కీలక పాత్ర

రాహుల్‌పై హడావుడిగా అనర్హత వేటు వేయడం వెనుక నరేంద్రమోదీ సర్కారుది కీలకపాత్ర. అనర్హుడిగా ఒక సభ్యుడిని ప్రకటించాలంటే దానికొక పద్ధతి ఉంటుంది. అనర్హత విషయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించాక రాష్ట్రపతి ఆమోదం తీసుకుని లోక్‌సభ స్పీకర్‌ చర్యలు చేపట్టాలి. దీనికి కొంత సమయం పడుతుంది. రాహుల్‌ విషయంలో ఇదంతా 24 గంటల్లోనే జరిగిపోయింది.

రాజీవ్‌ లలన్‌సింగ్‌, జేడీయూ జాతీయ అధ్యక్షుడు


కేంద్రం విశాల దృక్పథంతో వ్యవహరించాల్సింది

రాహుల్‌ విషయంలో కేంద్రం విశాల దృక్పథంతో వ్యవహరించి ఉండాల్సింది. నేను న్యాయకోవిదుడిని కాకపోయినా- పరువునష్టం కేసులో రాహుల్‌కు విధించిన శిక్ష మాత్రం ఎక్కువ అనిపిస్తోంది. కేంద్రం కనీసం కొన్ని రోజులపాటైనా నిరీక్షించి, అప్పీలులో రాహుల్‌కు ఉపశమనం లభించకపోతే అప్పుడు చర్యలు చేపట్టి ఉండాల్సింది. ఈ విషయంలో ప్రజల వద్దకు వెళ్లే సన్నద్ధత కాంగ్రెస్‌కు లేనట్లు కనిపిస్తోంది.  

ప్రశాంత్‌ కిశోర్‌, రాజకీయ వ్యూహకర్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని