పాతవి తీర్చడానికే 80% కొత్త అప్పులు

రాష్ట్ర ఆదాయ- వ్యయాలు, అప్పులు, అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అసత్యాలు, అర్ధ సత్యాలేనని కాగ్‌ నివేదికతో మరోసారి స్పష్టమైందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 05:29 IST

రాష్ట్రంలో సగటు మూలధన వ్యయం 9 శాతమే
ప్రభుత్వానివన్నీ అసత్యాలేనని ‘కాగ్‌’ నివేదికతో తేలింది  
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ఆదాయ- వ్యయాలు, అప్పులు, అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అసత్యాలు, అర్ధ సత్యాలేనని కాగ్‌ నివేదికతో మరోసారి స్పష్టమైందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త అప్పుల్లో 80 శాతం పాత రుణాలు తీర్చేందుకే వెచ్చిస్తున్నట్లు ‘కాగ్‌’ తేల్చిందని వెల్లడించారు. దేశంలో రాష్ట్రాల సగటు మూలధన వ్యయం 14.41 శాతం ఉండగా.. ఏపీలో 9.21 శాతానికి పడిపోవడానికి జగన్‌రెడ్డి విధ్వంసక విధానాలే కారణమని శనివారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ‘‘జీఎస్‌డీపీలో రాష్ట్ర అప్పులు 20 శాతం మించకూడదని కేంద్ర ఎఫ్‌ఆర్‌బీఎం చెబుతోంది. రాష్ట్రం మాత్రం 40 శాతానికి మించింది. ఏ ప్రాతిపదికన రాష్ట్రం అప్పులు చేస్తోంది? ఈ నాలుగేళ్లలో చేసిన అప్పెంత? రుణ వాయిదాలకు, వడ్డీలకు చెల్లిస్తున్నది ఎంత? అన్న వాస్తవాలను ప్రభుత్వం దాచిపెడుతోంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరగడంతో రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. రాష్ట్ర ఆదాయం రూ.1.06 కోట్లు అయితే అప్పులు, వడ్డీలు, జీతాలు, పింఛన్లు కలిపి రూ.97 వేల కోట్లు. అంటే.. సంక్షేమం, అభివృద్ధి చేయాలంటే అప్పు తప్పదన్నట్లు తయారైంది. అప్పులో మూలధన వ్యయం కోసం ఖర్చు చేసింది కేవలం రూ.16 వేల కోట్లే’’ అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ‘‘ఇప్పటి వరకు బడ్జెట్‌ పుస్తకాల్లో చూపకుండా రూ.1.25 లక్షల కోట్లు అప్పు చేశారు. కాగ్‌ లెక్కల ప్రకారం 2018-19 నాటికి సామాజిక సేవ మీద ఖర్చు రూ.64 వేల కోట్లు ఉండగా, 2021-22 నాటికి రూ.69 వేల కోట్లకు చేరింది. రూ.లక్ష కోట్లకు మించి అప్పు చేస్తే అందులో పేదలకు ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లు మాత్రమే. గతేడాది కంటే కేంద్ర ప్రభుత్వ రాబడులు పెరిగినా సంక్షేమంపై ఖర్చు అంతంత మాత్రమే. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సింగిల్‌ నోడల్‌ ఖాతాలను తెరవక రూ.6,356 కోట్ల మేర నిధులు మురిగిపోయాయి. విపత్తు నిర్వహణ నిధుల్ని వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు ఇష్టం వచ్చినట్లు మళ్లించుకున్నారు’’ అని యనమల ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు