తెదేపా వద్ద రూ.లక్షల కోట్ల అవినీతి సొమ్ము లేదు

వైకాపా ఎమ్మెల్యేలను రూ.15 కోట్లకు చంద్రబాబు కొనుగోలు చేశారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గులేకుండా మాట్లాడారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు.

Published : 26 Mar 2023 05:29 IST

ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శలపై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలను రూ.15 కోట్లకు చంద్రబాబు కొనుగోలు చేశారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గులేకుండా మాట్లాడారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనడానికి జగన్‌ దగ్గర ఉన్నట్లు తెదేపా దగ్గర క్విడ్‌ ప్రోకోలు, మనీలాండరింగ్‌లతో వచ్చిన రూ.లక్షల కోట్ల అవినీతి సొమ్ములేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారో కనిపెట్టడానికి కోడింగ్‌ అమలు చేశామన్న సజ్జల వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించి జగన్‌రెడ్డి, వైకాపాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడితో కలిసి శనివారం ఆనంద్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ‘‘సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడింగ్‌ తరహా పద్ధతుల్ని వైకాపా వాళ్లు అనుసరించడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే. జగన్‌పై ద్వేషంతో అంతరాత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్యేలు ఓటేస్తే దానికి సిగ్గుపడకుండా కోడింగ్‌ అమలు చేసి తెలుసుకున్నామని చెబుతారా? ప్రభుత్వం రాజధానిని సర్వనాశనం చేస్తున్నా ఓట్లేసిన ప్రజల్ని కాదని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వైకాపానే నమ్ముకున్నారు. ఇప్పుడు ఓ దళిత మహిళ అని కూడా చూడకుండా సొంత మీడియాలో ఆమెను దోషిగా చూపుతున్నారు. అసెంబ్లీలో తెదేపా బలమెంతో, వైకాపా బలమెంతో సజ్జలకు తెలియదా? తెదేపా ఎమ్మెల్యేలు నలుగుర్ని జగన్‌ ఎన్ని కోట్లకు కొన్నారో సజ్జల చెప్పాలి’’ అని నక్కా ఆనంద్‌బాబు విమర్శలు చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని తెదేపా ప్రభుత్వ హయాంలో ఆమోదించి కేంద్రానికి పంపిన బిల్లు విషయం జగన్‌కు తెలియదా అని నిలదీశారు. గతంలో పంపిన బిల్లుని కేంద్రంతో ఆమోదింపచేయించుకోలేని జగన్‌.. మళ్లా అదే బిల్లుని తిరిగి పంపడమేంటని ఎద్దేవా చేశారు.

ఆ జిల్లాల వారినే ఎస్టీ జాబితాలో ఎలా చేరుస్తారు?: బీటీ నాయుడు

‘‘రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకులు, బోయలు ఉంటే కేవలం కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని వారినే ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఏంటి? కర్నూలు జిల్లాలోని వారు ఎస్టీలు అయితే పక్కనే ఉన్న నంద్యాలలోని వారు బీసీలా? కడప జిల్లాలోని వారు ఎస్టీలయితే అన్నమయ్య జిల్లా సంగతేంటి? గతంలో వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తూ చంద్రబాబు చేసిన తీర్మానంపై ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు ఏర్పాటు చేసిన వాల్మీకి ఫెడరేషన్‌ను నిర్వీర్యం చేసింది వైకాపా ప్రభుత్వం కాదా?’’ అని బీటీ నాయుడు నిలదీశారు.


మేరీలాండ్‌, శాక్రమెంటోల్లో తెదేపా నూతన కమిటీలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రానికి, శాక్రమెంటో నగరానికి తెదేపా ఎన్నారై విభాగం నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మేరీలాండ్‌ కమిటీ అధ్యక్షుడిగా రాజా రావులపల్లి, ఉపాధ్యక్షుడిగా జి.నాగప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా ఎం.సోంబాబు, కోశాధికారిగా వై.నాగసుష్మ, రీజనల్‌ కౌన్సిల్‌ రిప్రజంటేటివ్‌గా ఎ.గోపీకృష్ణ, సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌గా బి.జానకీరామలను నియమించారు. శాక్రమెంటో కమిటీ అధ్యక్షుడిగా అమితాబ్‌ షేక్‌, ఉపాధ్యక్షుడిగా వెంకట్‌ కోనేరు, ప్రధాన కార్యదర్శిగా మురళీచంద్ర, కోశాధికారిగా హరి, రీజనల్‌ కౌన్సిల్‌ రిప్రజంటేటివ్‌గా ఎం.రామకృష్ణ, సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌గా కె.రామారావులను నియమించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు