Vundavalli Sridevi: అక్రమాలకు అడ్డొస్తున్నాననే తొలగించారు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు హాని ఉందని, తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని వైకాపా నుంచి సస్పెండయిన గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు.

Updated : 27 Mar 2023 09:41 IST

సజ్జల నుంచి నాకు హాని ఉంది
వైకాపా నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపణలు
మూడున్నరేళ్లుగా పార్టీ స్వార్థానికి వాడుకుంది
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాకే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడతా
ఇక స్వతంత్ర ఎమ్మెల్యేను.. అమరావతికి అండగా ఉంటా  
హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడి

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు హాని ఉందని, తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని వైకాపా నుంచి సస్పెండయిన గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానేదో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డానని మూడు రోజుల నుంచి సొంత పార్టీకి చెందిన గూండాలతో బెదిరిస్తున్నారని, గుంటూరులోని తన కార్యాలయాన్ని ధ్వంసం చేయించారని ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం తనపై జరుగుతున్న దాడి అని చెప్పారు. దళిత మహిళా ఎమ్మెల్యేనని చూడకుండా తనను ఇంత క్షోభపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో గెలిచిన తనను మూడున్నరేళ్లపాటు ప్రభుత్వం, పార్టీ స్వార్థానికి వాడుకుని చివరకు సస్పెన్షన్‌ వేటేసి, రోడ్డున పడేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవసానాల తర్వాత తొలిసారిగా ఆమె ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మాట్లాడారు.

‘ఎమ్మెల్సీ ఎన్నిక ఓటు విషయంలో నా గురించి వారం ముందు నుంచే రకరకాలుగా మాట్లాడారు. ఎన్నికకు ముందు మా అమ్మాయితో కలిసి వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అయ్యాను. ఒక సోదరుడిలా అండగా ఉంటాను.. అన్నీ చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. అప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అక్కడే ఉన్నారు. రహస్య పద్ధతిలో జరిగిన ఎన్నికలో నేను ఎవరికి ఓటేశానో ఎవరైనా లోపలికి వచ్చి చూశారా? లేక టేబుల్‌ కింద ఎవరైనా ఉన్నారా? కెమెరాలు ఏమైనా పెట్టారా? నేను ఓటేసే సమయంలోనే మా గ్రూపులో ఉన్న కాకినాడ ఎమ్మెల్యే, పార్టీలోకి వచ్చిన జనసేన ఎమ్మెల్యే వచ్చారు. ప్రభుత్వ పెద్దలు చేసే ఇసుక, మైనింగ్‌ దందాలకు నేను రాజధానిలో బినామీగా ఉండటం లేదు. అది నచ్చక ఎలాగైనా నన్ను రాజధాని ప్రాంతం నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ఆది నుంచే నాపై దాడి జరుగుతోంది. నాపై చర్యలు తీసుకోవటానికి వారికి ఎమ్మెల్సీ ఎన్నిక కలిసొచ్చింది. లేనిపోని నిందలు మోపటం, అందరితో తిట్టించటం, పారిపోయినట్లు కట్టుకథలు అల్లటం అందులో భాగమే. ఎమ్మెల్సీ జీతం ఎంత? లక్షన్నర, 2 లక్షలు ఉంటుందా? నేను గౌరవప్రదమైన వైద్యవృత్తిలో ఉన్నాను. హైదరాబాద్‌లో పేరెన్నికగన్న ప్రసూతి వైద్యురాలినే కాదు ఐవీఎఫ్‌ నిపుణురాలిని.  నాకు 11 ప్రపంచ రికార్డులు వచ్చాయి. అమెరికాలో టీవీ షోలు చేశాను. చంద్రబాబు అమరావతిని రాజధానిని చేశారు.. ఈ ప్రాంతంలో మనం గెలవాలంటే మీలాంటి గొప్ప వైద్యులు ప్రజాజీవితంలోకి రావాలని.. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయొచ్చని జగన్‌ నాడు నమ్మబలికారు. మా తండ్రి ఉండవల్లి సుబ్బారావు కోరిక మేరకు ప్రజాసేవ చేద్దామనుకున్నాను. కానీ రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అని తలదించుకోవాల్సి వస్తోంది. నాపై దొంగ అని ముద్ర వేశారు. నేను ఎమ్మెల్యేగా ఉండగానే ఏడాదిన్నర ముందు నుంచే సమన్వయకర్తలను పెడుతూ వచ్చారు. అయినా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి వారికి సహకరిస్తున్నాను.

అమరావతి ఇక్కడే ఉంటుందన్నా..

ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లో ప్రజలు రాజధానిగా అమరావతి ఉంటుందా? అని నన్ను ప్రశ్నించారు. మా జగనన్న తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నారు.. కచ్చితంగా ఇక్కడే ఉంటుందని చెప్పి వారి మన్ననలు పొంది ఎమ్మెల్యేను అయ్యాను. అయితే ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీ ఆ మాట తప్పింది. సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, బిల్డ్‌ అమరావతి అంటూ నన్ను ఎన్నుకున్న నా తోటి మహిళలే మొర పెట్టుకుంటుంటే వారికి ఎమ్మెల్యేగా ఏం చేయలేకపోయినందుకు బాధపడ్డాను. అమరావతిలో ఒక్క ఇటుకైనా పేర్చారా? అసలు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారు? అభివృద్ధి అంటే జగనన్న ఇళ్లు అంటారు. ఆ మాటలు చెప్పకండి. ఆ పథకమే ఓ పెద్ద కుంభకోణం.

ఎస్సీలంటే చులకన

ఎస్సీలు అంటేనే రాష్ట్రంలో చులకన. అసలు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే భయమేస్తోంది. ఎస్సీలపై దాడులు చేయటం, బెదిరించటం, హత్యలకు పాల్పడటం జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా ఉండి నేనే భయపడుతున్నానంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రతి వ్యక్తికి కొన్ని నైతిక విలువలు ఉంటాయి. ఒక వైద్యురాలిగా రోగి వివరాలు వెల్లడించడంలో గోప్యత పాటిస్తాం. ఒక ఇల్లు ఖాళీ చేయాలంటే ముందస్తు నోటీసు ఇస్తాం. అలాంటిది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండగా నాపై సమన్వయకర్తల పెత్తనమేంటి? గడపగడపకు- మన ప్రభుత్వ కార్యక్రమం కింద ప్రజల ముంగిటకు వెళ్లకుండా కట్టడి చేయడమేంటి? ఒక ఎమ్మెల్యేకు ప్రజల దగ్గరకెళ్లే పరిస్థితి ఉండదా? ఇదేం రాజ్యాంగమో అర్థం కావటం లేదు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ కరోనా ఉద్ధృతంగా ఉంది. అలా అని భయపడి నేను వెళ్లకపోతే పార్టీ అభ్యర్థులే వైరివర్గాలుగా ఏర్పడి చివరకు ఓడించుకుంటారని భావించి ఆ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లాను. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు క్లీన్‌ స్వీప్‌ చేశారు. పోలింగ్‌ సమయానికి నాకు కరోనా సోకి వెంటిలేటర్‌ మీదకు వెళ్లాను. అలాంటి నా పట్ల పార్టీ పెద్దలు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? నిబద్ధతతో ఉన్న నాకు సస్పెన్షన్‌ బహుమతిగా ఇస్తారా?  

డాక్టర్‌ వైఎస్సార్‌ పార్టీ అని..

దివంగత వైఎస్సార్‌ వైద్యుడు.. మంచి వ్యక్తి అని నా భర్త జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడవటానికి ప్రోత్సహించారు. అలా పార్టీలోకి వెళ్లాం. కానీ పరిస్థితులు ఏం బాగోలేదు. సీఎం జగన్‌ అంటే చాలా గౌరవం. కానీ మూడున్నరేళ్లుగా బానిస సంకెళ్లలో ఉన్నాను. ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుంది. నేను డబ్బులు తీసుకున్నానని గోల చేస్తున్నారు. పార్టీ పెద్దలకు ఒకటే సవాల్‌ చేస్తున్నా.  రండి దీనిపై ప్రమాణం చేద్దాం. నేను బిస్కెట్లు, చాక్లెట్లకు ఆశపడే బ్యాచ్‌ కాదు. వైద్యురాలిని. కష్టపడి పనిచేస్తే నాకెన్నో డబ్బులు వస్తాయి. కొంతమంది పోలీసులు గంజాయి తీసుకొచ్చి నాపై కేసులు బనాయించే ప్లాన్‌ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నాకు ఎలాంటి హాని జరగదని భరోసా ఇస్తేనే ఏపీలో అడుగుపెడతా. అందుకు విరుద్ధంగా ఏదైనా జరిగితే ప్రభుత్వ సలహాదారు సజ్జలే బాధ్యత వహించాలి. ఆయన నుంచే నాకు హాని ఉంది. ఈ విషయమై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు పిటిషన్‌ పెడతా. దళిత ఎమ్మెల్మే, మహిళే కదా అనుకుంటే పొరపాటే. నేనేంటో చూపిస్తా. వైకాపాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా.

దందాలు తెలిసీ మాట్లాడరే?

రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉండే ఓ ప్రజాప్రతినిధి చేసే దందాలు తెలియవా? గౌరవ సీఎం.. ప్రతిపక్షాలనుద్దేశించి దోచుకో, పంచుకో, తినుకో అంటుంటారు. రోజంతా రాజధాని నుంచి ఎన్ని అక్రమ లారీలు వెళుతున్నాయి? ఆ డబ్బులు ఎవరు తింటున్నారో మీకు తెలుసు. అలాంటి ప్రజాప్రతినిధులను బినామీలుగా పెట్టుకున్నారు. వారి దందాలకు నేను అడ్డొస్తున్నానని, వారడిగిన అడ్డగోలు పనులు చేయట్లేదని అక్కసుతో నన్ను సస్పెండ్‌ చేశారు.

అమరావతి ఉద్యమంలో భాగస్వామినవుతా

మా అమ్మాయి దిల్లీలో చదువుతోంది. ఎవరైనా మీ రాజధాని ఏదని అడిగితే చెప్పుకోవటానికి ఏమీ లేదు. రాజధాని లేని రాష్ట్రం కాకుండా ‘మన అమరావతి- మన రాజధాని’ అని అమరావతి రైతులు చేసే పోరాటంలో నేను భాగస్వామిని అవుతా. రాజధాని రైతులు నా కళ్లు తెరిపించినందుకు సంతోషం. వారితో కలిసే టెంట్‌లో కూర్చొని సేవ్‌ అమరావతి అంటూ ముందుకు సాగుతా. కచ్చితంగా అమరావతిలోనే రాజధాని కడతాం. నా శాయశక్తులా మీకు అండగా ఉంటాను. ప్రాణం పోయినా మీతో కలిసి పోరాడతానని వారికి మాటిస్తున్నాను.  ఇక నేను స్వతంత్ర ఎమ్మెల్యేను. నాకేం పార్టీల్లేవు.

ఆ చట్టాలు ఎందుకు?

రక్షణ లేని ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం బాధాకరం. దిశ చట్టం, దిశ స్టేషన్లు, జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఇవన్నీ నా విషయంలో ఎక్కడికి పోయాయి? మీకు ధైర్యం ఉంటే నా కార్యాలయంపై దాడి చేసిన గూండాలను, సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేసే వారిని అరికట్టండి. మహిళా ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వండి. జై అమరావతి’ అంటూ ముగించారు.


మా బలం చూసి టికెట్‌ ఇచ్చారు
- శ్రీదేవి భర్త డాక్టర్‌ కె.శ్రీధర్‌

మేమిద్దరం దశాబ్దాలుగా వైద్యవృత్తిలో ఉన్నాం. మేం రూ.లక్షకు కొన్న స్థలం ఇప్పుడు రూ.10 కోట్లు అయింది. అలా మా ఆస్తులు పెరిగాయి. రూ. 10, 15 కోట్లకు ఆశపడి అమ్ముడుపోయే వ్యక్తులం కాదు. మావి వేర్వేరు సామాజికవర్గాలు. మా ఇద్దరి సామాజికవర్గాలను చూసే నాడు సీటు కేటాయించారు. నియోజకవర్గంలో మీ సామాజికవర్గం (కాపుల) ఓట్లు 15 వేలు ఉన్నాయి.. అందులో సగం తెచ్చుకుంటే గెలుపు మీదే అని నాతో అన్నారు. అప్పటికి 8 వేల ఓట్లు వెనకబడి ఉన్నట్లు వారి సర్వేలో తేలిందని చెప్పారు. ఎన్నికల్లో నా సామాజికవర్గం (కాపులు) ఓట్లు పదివేలకు పైగా మాకు పడటంతో 4,400 మెజార్టీతో గెలుపొందాం. ఇది మా రాజకీయ నేపథ్యం. ఇలా ఉన్న తాము రూ.10 కోట్లకు అమ్ముడుపోతామా? రాజధాని సీటు గెలిచినందుకు జగన్‌ అభినందించారు. ఇంత నిబద్ధతగా ఉన్న మమ్మల్ని అనేక విధాలుగా అవమానించినా వాటన్నింటిని దిగమింగుకుని పార్టీలోనే కొనసాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె భర్త, కుటుంబసభ్యులు ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.


విలేకరుల ప్రశ్నలు.. శ్రీదేవి జవాబులు

మీరు వేరే పార్టీలో చేరే ఆలోచన ఉందా?

ఇప్పటికే జగన్‌ కొట్టిన దెబ్బకు మా మైండ్‌ బ్లాంక్‌ అయింది. వేరే పార్టీలో చేరే రోజు వస్తే కచ్చితంగా అందర్నీ పిలిచే చెబుతాను.  

అజ్ఞాతంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది?

గతంలో డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ అచ్చెన్నలు ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. డాక్టర్‌ శ్రీదేవి అలా చనిపోకూడదనే ఉద్దేశంతోనే బయటకు వెళ్లిపోయాను.

ఈ విషయమై జగన్‌తో మాట్లాడారా?

జగన్‌కు చెవులు మాత్రమే ఉంటాయి. ఎవరు చెప్పినా వింటారు. వాటిని చెక్‌ చేసుకోవటంలో తేడా జరుగుతోంది.

మీకు ప్రజల్లో సానుకూలత లేదనే సమన్వయకర్తలను పెట్టారంటున్నారు కదా?

ఐప్యాక్‌ బృందం, ఇంటెలిజెన్స్‌ నివేదికలన్నీ మనం డబ్బులిచ్చి రాయించుకునేవే. అవి బూచి. రాజధానిలో అభివృద్ధి చేయకపోతే ప్రజల నుంచి నెగటివ్‌ వస్తుందని గతంలోనే సీఎంను కలిసి చెప్పా. ఏం ఫర్వాలేదు. తుళ్లూరు మండలంలో నెగటివ్‌ వచ్చినా.. పేరేచర్ల జగనన్న లేఅవుట్‌లోకి 75 వేల మంది వస్తారు. అక్కడ మనకు ప్లస్‌ అవుతుంది. ఏమీ ఇబ్బంది ఉండదన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు