స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం!

మరాఠా గడ్డపై భారాస ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ ఆసాంతం రైతు పథకాలే ఎజెండాగా సాగింది. నేతలు తమ ప్రసంగాల్లో తెలంగాణలో అమలవుతున్న వాటిని ప్రస్తావించారు.

Published : 27 Mar 2023 05:08 IST

మహారాష్ట్రలో భారాస సభ విజయవంతం
కంధార్‌-లోహ నుంచి ఈనాడు ప్రతినిధులు

మరాఠా గడ్డపై భారాస ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ ఆసాంతం రైతు పథకాలే ఎజెండాగా సాగింది. నేతలు తమ ప్రసంగాల్లో తెలంగాణలో అమలవుతున్న వాటిని ప్రస్తావించారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగానే సభ, జన సమీకరణ జరిగింది. గత నెల 5న నాందేడ్‌ జిల్లా కేంద్రంలో జరిగిన చేరికల సభకంటే.. ఆదివారం నాటి సభకు భారీగా జనం హాజరయ్యారు. లోహలోని బైల్‌ బజార్‌ (పశువుల సంత) 18 ఎకరాల మైదానం మొత్తం కిక్కిరిసింది. సభ జరుగుతున్న సమయంలోనూ... తరలివస్తున్న వాహనాలు కొన్ని.. సభాస్థలికి కొంత దూరంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. నాందేడ్‌ సభకు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి జనం హాజరయ్యారు. ఆ సందర్భంలో తెలంగాణ ఎమ్మెల్యేలు జన సమీకరణలో కీలకంగా వ్యవహరించారు. కానీ లోహ సభ ఇందుకు భిన్నంగా జరిగిందని చెప్పొచ్చు. దీనికి హాజరైన వారంతా స్థానికులే. నాందేడ్‌, లాతూర్‌, పర్బనీ లోక్‌సభ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధికంగా ప్రజలు తరలివచ్చారు. తాజాగా భారాసలో చేరిన నాయకులే తమ బలనిరూపణ చేసుకున్నట్లుగా పోటీపడి జనాన్ని తీసుకొచ్చినట్లు కనిపించింది. మండల కేంద్రాల్లో హోర్డింగ్‌లు, గోడ రాతలు, వాహనాలకు పోస్టర్లు కనిపించాయి. ముఖ్యంగా రైతు నాయకుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్యే శంకర్‌ అన్నా ధోండ్గే, ఆయన అనుచరులు భారీగా పార్టీలో చేరడంతో కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చారు.

భారాసలో పలువురి చేరిక..

భారాస బహిరంగ సభ వేదికపై పలువురు ఆ పార్టీలో చేరారు. కేసీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎంపీ హరిబావ్‌ రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే శంకరన్న ధోండ్గే, హర్షవర్ధన్‌ జాదవ్‌, డాక్టర్‌ వసంతరావు బోండేలతో పాటు గతంలో అసెంబ్లీకి పోటీ చేసిన నాగ్‌నాథ్‌ ఘిసేవాడ్‌, సురేష్‌ గైక్వాడ్‌, జకీర్‌ చావ్స్‌లతో పాటు ఎంపీగా పోటీ చేసిన యష్‌పాల్‌ భింగే, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ ప్రహ్లాద్‌ రొఖండో సహా పలువురు జడ్పీటీసీ స్థాయి నాయకులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు.

నాయకుడి ఇంటికి కేసీఆర్‌

కేసీఆర్‌ సభకు వచ్చే ముందు.. మాజీ ఎమ్మెల్యే శంకర్‌ అన్నా ధోండ్గే ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు మరాఠా సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. కొబ్బరి కుడకలతో రూపొందించిన భారీ గజమాలతో ఆయన్ని సత్కరించారు. కేసీఆర్‌ సభలో తన ప్రసంగానికి ముందు.. వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, బసవేశ్వరుడు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, అన్నాబాహు సాఠే, మహాత్మా జ్యోతిబా ఫులే, అహల్యాబాయి హోల్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నమస్కరించారు. చివర్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌, బాల్క సుమన్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, అమృత్‌లాల్‌ చౌహాన్‌, భాస్కర్‌, రాఘవ్‌లను కేసీఆర్‌ అభినందించారు.


చైతన్యపర్చేలా కేసీఆర్‌ ప్రసంగం

36 నిమిషాల పాటు సాగిన భారాస అధినేత కేసీఆర్‌ ప్రసంగం.. పెద్దగా రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా.. రైతులను ఆలోచింపజేసేలా సాగింది. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూనే.. వారికి అవసరమైన విషయాలను చెప్పి.. కావాలా..వద్దా అంటూ అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో రైతులు.. అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ అంటూ పలుమార్లు నినదించారు. ఆయన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ.. నిజమా కాదా.. అని అడిగిన సందర్భంలో వారి నుంచి స్పందన కనిపించింది. తనను సోలాపుర్‌ ప్రాంత నాయకులు కూడా కలిశారని.. త్వరలో అక్కడ, రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని సభలుంటాయనే సంకేతమిచ్చారు. సభా వేదికపై సుమారు వంద మంది వరకు మరాఠా నాయకులు, రైతు, దళిత సంఘాల ప్రతినిధులు కూర్చున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు