ఎవరి పక్షాన శ్రీదేవి పోరాటం చేస్తారు?: మంత్రి వనిత

వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటు వేసిన ఉండవల్లి శ్రీదేవి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 02:58 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటు వేసిన ఉండవల్లి శ్రీదేవి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. అమరావతి రైతుల కోసం పోరాటం చేస్తానని ఆమె అంటున్నారని, రాజధాని కావాలని పోరాడుతున్న రైతులే టెంట్‌లు లేపేసి వెళ్లిపోయారని, ఇప్పుడు ఎవరి పక్షాన, ఎవరితో కలిసి పోరాటం చేస్తారో అర్థం కావడం లేదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి వనిత మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ను గుర్తించడానికి ఒక కోడింగ్‌ పెట్టడం ద్వారా ఎవరు క్రాస్‌ ఓటు వేశారనేది నిర్థారణ అయిన తర్వాతే పార్టీ చర్యలు తీసుకుంది. ఏ పార్టీకి మద్దతుగా లేనని, స్వతంత్రంగా ఉన్నానని శ్రీదేవి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఆమె ఏమైనా ఇబ్బంది పడ్డారా, పొరపాటు పడ్డారా అనేది స్పష్టత ఇస్తే సరిపోతుంది...’ అని పేర్కొన్నారు. తెదేపా పక్షాన చేరి అమరావతిలోనే రాజధాని ఉండేలా తాను పోరాడతానని శ్రీదేవి అంటున్నారని, అవన్నీ వినడానికి, ట్రోల్‌ చేయడానికే తప్ప... ఎటువంటి ఉపయోగం ఉండదని మంత్రి వనిత చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని