ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌ చేయాలన్నారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేస్తే మంచి స్థానంతోపాటు కొన్ని ఆఫర్లు ఉంటాయని, రూ.10 కోట్లు ఇస్తామని తన స్నేహితుడు కేఎస్‌ఎన్‌రాజు ద్వారా తెదేపా వారు ప్రతిపాదించారంటూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Published : 27 Mar 2023 02:58 IST

ఉండి తెదేపా ఎమ్మెల్యే రామరాజు కోరితే తిరస్కరించా  
రాజోలు ఎమ్మెల్యే రాపాక వెల్లడి
నాయకుడి మెప్పు కోసమే అభాండాలు: రామరాజు

రాజోలు, సఖినేటిపల్లి, పాలకోడేరు, ఉండి, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేస్తే మంచి స్థానంతోపాటు కొన్ని ఆఫర్లు ఉంటాయని, రూ.10 కోట్లు ఇస్తామని తన స్నేహితుడు కేఎస్‌ఎన్‌రాజు ద్వారా తెదేపా వారు ప్రతిపాదించారంటూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రూ.కోట్ల కన్నా పరువే ముఖ్యమని భావించి ఆ ఆఫర్‌ను వదులుకున్నానని అంతర్వేదిలో ఈ నెల 24న రాత్రి జరిగిన వైకాపా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రాపాక మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ అయ్యింది. దీనిపై ఆదివారం రాజోలు మండలం చెన్నడంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా తెదేపాకు అనుకూలంగా చేస్తే ఆర్థికంగానూ, భవిష్యత్తులోనూ మంచి స్థానం ఉంటుందని పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రామరాజు కోరగా తాను తిరస్కరించానని అన్నారు. జగన్‌పై ఉన్న నమ్మకమే తనను డబ్బుకు ఆశ పడకుండా చేసిందని వ్యాఖ్యానించారు.


రాపాక ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఎమ్మెల్యే రామరాజు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రలోభాలకు గురిచేసినట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైకాపా ఎమ్మెల్యేలు తారసపడినప్పుడు సరదా సంభాషణలే తప్ప.. ఎన్నికల రాజకీయాల గురించి, వ్యక్తిగతంగా డబ్బులిస్తానని గానీ ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్ఠ  పెంచుకోవడం, ఆ నాయకుడి మెప్పు కోసమే డబ్బు ఎర చూపించారని అభాండాలు వేస్తున్నారన్నారు. ఆయన ఏ పార్టీలో గెలుపొందారు? ఇప్పుడు ఏ పార్టీతో పయనిస్తున్నారనేది ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని హితవుపలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని