క్షేత్రస్థాయికి వెళ్లేలా తెదేపా కార్యాచరణ

తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి.. వరుస కార్యక్రమాల నిర్వహణకు పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందిస్తోంది. చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి నేతల వరకు క్షేత్రస్థాయిలో ఉండేలా ప్రణాళిక తయారు చేస్తోంది.

Updated : 27 Mar 2023 06:09 IST

రేపు హైదరాబాద్‌లో పొలిట్‌బ్యూరో భేటీ
29న పార్టీ ప్రతినిధుల సభ

ఈనాడు, అమరావతి: తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి.. వరుస కార్యక్రమాల నిర్వహణకు పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందిస్తోంది. చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి నేతల వరకు క్షేత్రస్థాయిలో ఉండేలా ప్రణాళిక తయారు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా సమస్యలపై పోరాటం, సంస్థాగత కార్యక్రమాల సమాహారంగా నిరంతరం ప్రజల మధ్య ఉండేలా కసరత్తు చేస్తోంది. మార్చి 28న హైదరాబాద్‌లో పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో.. మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్చి 29న హైదరాబాద్‌లో పార్టీ ప్రతినిధుల సభ జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభకు రెండు రాష్ట్రాల నుంచి తెదేపా నేతలు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు నియోజకవర్గ బాధ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. క్లస్టర్‌ ఇన్‌ఛార్జి నుంచి రాష్ట్ర కమిటీ నాయకులు కూడా వీటికి హాజరవుతున్నారు.

ఏప్రిల్‌లో జోనల్‌ సమావేశాలు

ఏప్రిల్‌ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాల్లో పార్టీ జోన్‌-1, జోన్‌-4, జోన్‌-5 సమావేశాలు జరగనున్నాయి. అనంతరం అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం అంతా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహణ, ప్రజా సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి పోరాటాలకు కసరత్తు చేస్తున్నారు. తెదేపా ఇక అన్‌స్టాపబుల్‌ అని అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడంతో.. అందుకు అనుగుణంగానే పార్టీ కార్యక్రమాలను నిర్వహించేలా రోడ్‌మ్యాప్‌ తయారవుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.


ఎన్టీఆర్‌ అందరికీ మార్గదర్శకులు: చంద్రబాబు

ఈనాడు, అమరావతి: నటుడిగా, రాజకీయనాయకుడిగా ఘన విజయాలను సాధించిన ఎన్టీ రామారావు.. అందరికీ మార్గదర్శకులని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆ మహానటుడి ఘనతను చాటి చెప్పేందుకు.. గత అయిదు నెలలుగా ఎన్టీఆర్‌ శతజయంతి కమిటీ చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్దన్‌ సారథ్యంలోని బృందం సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఎన్టీఆర్‌ వెబ్‌సైట్‌తో పాటు శకపురుషుడు అనే ప్రత్యేక సంచిక, శాసనసభలో ఆయన చేసిన ప్రసంగాలతో పుస్తకాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. శతజయంతి వేడుకల్లో భాగంగా విజయవాడలో ప్రసంగాల పుస్తకాలను, హైదరాబాద్‌లో వెబ్‌సైట్‌తో పాటు శకపురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా చంద్రబాబుకు వివరించారు. ఎన్టీఆర్‌ను తరతరాలుగా గుర్తుంచుకునేలా వీడియో, వ్యాస రూపంలో ప్రముఖులు, రాజకీయ రంగంలోని వారి అభిప్రాయాలను తీసుకుంటున్నామని చెప్పారు. బృందం సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్‌, కె.రవిశంకర్‌, విక్రమ్‌ పూల, భగీరథ, అట్లూరి నారాయణరావు, డి.రామ్‌మోహన్‌రావు, మండవ సతీశ్‌, కె.రఘురామ్‌, శ్రీపతి సతీశ్‌, మధుసూదన్‌రాజు, విజయభాస్కర్‌, గౌతమ్‌ బొప్పన తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని