మోదీ పిరికి ప్రధాని.. సమాధానం చెప్పలేకే ఈ అణచివేత

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆదివారం ఆ పార్టీ సంకల్ప సత్యాగ్రహం నిర్వహించింది. అన్ని రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

Updated : 27 Mar 2023 06:54 IST

ప్రతి సభలో మా నాన్నను అవమానిస్తున్నారు
తండ్రెవరో రాహుల్‌కు తెలియదని ఒక సీఎం దారుణ వ్యాఖ్యలు చేశారు
సంకల్ప సత్యాగ్రహ సభలో ప్రియాంకా గాంధీ ధ్వజం
రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనలు
ఈనాడు - దిల్లీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆదివారం ఆ పార్టీ సంకల్ప సత్యాగ్రహం నిర్వహించింది. అన్ని రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ బయట పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సత్యాగ్రహం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భావోద్వేగంతో మాట్లాడారు. తన కుటుంబానికి, సోదరుడికి జరిగిన అవమానాల గురించి వివరించారు. ‘ఈ దేశ ప్రధాన మంత్రి పిరికివాడు. అహంకారి. అధికారం వెనుక దాక్కున్నారు. అహంకారి అయిన రాజుకు ప్రజలు బుద్ధి చెప్పడం మన దేశ సంప్రదాయంలో ఉంది. అది ఇక్కడా జరుగుతుంది. ప్రజలు వాస్తవాన్ని గుర్తించారు. ఇక ముందు పరిస్థితులన్నీ మారిపోతాయి’ అని ఆమె పేర్కొన్నారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నా తండ్రిని ప్రస్తుతం ప్రతి పార్లమెంటు సమావేశాల్లో అవమానిస్తున్నారు. ఆ త్యాగమూర్తి కుమారుడిని ఇప్పుడు దేశద్రోహి అని, మీర్‌ జాఫర్‌ అని అవమానకరంగా అభివర్ణిస్తున్నారు. నా తల్లినీ అవమానిస్తున్నారు. తండ్రెవరో రాహుల్‌ గాంధీకి తెలియదని భాజపా ముఖ్యమంత్రి ఒకరు అత్యంత దారుణ వ్యాఖ్యలు చేశారు. ఈ కుటుంబం నెహ్రూ పేరెందుకు పెట్టుకోదని ప్రధాన మంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించారు. కశ్మీర్‌ పండితుల ఆచారాలను అవమానించారు. కానీ అలాంటి వారిపై ఎలాంటి కేసులు, శిక్షలూ లేవు. వారిని పార్లమెంటు నుంచి ఎవరూ బయటకు తోసేయరు. మా కుటుంబాన్ని నిరంతరం అవమానిస్తూ వస్తున్నా ఇప్పటివరకూ మౌనంగా ఉన్నాం. నా అన్న పార్లమెంటులో మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకుని మీపట్ల నాకెలాంటి విద్వేషం లేదని చెప్పారు. అయినప్పటికీ ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఎంతకాలం అవమానిస్తారు? ఇదేనా ఈ దేశ సంస్కృతి. మాది కుటుంబ స్వామ్యం అంటారు. అలాగైతే భగవాన్‌ రాముడు ఎక్కడివారు. కుటుంబం, పుట్టిన నేల కోసం వనవాసానికి వెళ్లిన రాముడినీ కుటుంబవాది అంటారా? పాండవులూ కుటుంబ వాదులేనా? మా కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది. ప్రజాస్వామ్యం కోసం రక్తం ధారపోసింది. ఈ త్రివర్ణ పతాకంలో, ఈ నేలలో మా కుటుంబ సభ్యుల రక్తం ఉంది. అలాంటి కుటుంబంపై దర్యాప్తు ఏజెన్సీలను ఉసిగొల్పి భయపెదామనుకుంటే సాధ్యం కాదు. మరింత బలంగా పోరాడే వాళ్లమే తప్ప మేం భయపడేవాళ్లం కాదు’ అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు.

ప్రజా సంపదను దోచిపెడుతున్నారు

‘ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏం చేయడానికైనా సిద్ధం. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహా పురుషులు భారత ప్రజాస్వామ్య సౌధానికి పునాదులు వేశారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్న ప్రశ్న అప్పుడప్పుడూ నా మదిలో మెదులుతుంటుంది. మొత్తం దేశ సంపదను దోచుకుని ఒక వ్యక్తికి కట్టబెడుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్లకు కట్టబెడుతున్నది రాహుల్‌ గాంధీ సంపద కాదు... ప్రజల సంపద. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థలను ఒకదాని తర్వాత ఒకటిగా అమ్మేస్తున్నారు. ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్‌ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక భయాందోళనకు గురై నియంత తరహాలో మొత్తం అధికారాన్ని ప్రయోగించి ప్రజలను, వారికోసం ప్రశ్నించే వారిని అణచివేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రధాన మంత్రి, కేబినెట్‌ మంత్రులు, మొత్తం వ్యవస్థ కలిసి ఒక వ్యక్తిని కాపాడటానికి ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది ప్రజలు ఆలోచించాలి. మేం చేస్తున్న ఈ పోరాటం ప్రజల కోసమే.

దేశాన్ని కలిపి ఉంచడానికే పాదయాత్ర

నా సోదరుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు దేశాన్ని కలపడానికి ఒంటరిగా నడిస్తే ప్రభుత్వంలోని మంత్రులు, మీడియావారు.. రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లి దేశాన్ని, ఒక వర్గాన్ని అవమానించారని ఆరోపిస్తున్నారు. దేశంలో అందరూ కలిసి ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని 5వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వ్యక్తికి దేశాన్ని, ఒక వర్గాన్ని అవమానించాలన్న భావన ఉంటుందా? ఒక వ్యక్తి ప్రజల కోసం గొంతెత్తి పేదల హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛగా ప్రశ్నించడమే. ఇప్పుడు ఆ హక్కునే లాగేసుకుంటున్నారు. రాహుల్‌ గాంధీపై పరువు నష్టం దావా వేసిన వ్యక్తే హైకోర్టుకు వెళ్లి ఏడాదిపాటు స్టే తెచ్చుకున్నారు. కానీ పార్లమెంటులో అదానీపై రాహుల్‌ ప్రశ్నించిన వారంలోనే అదే వ్యక్తి హైకోర్టుకు వెళ్లి కేసు విచారణపై స్టే రద్దు చేయించుకుని విచారణకు అనుమతివ్వాలని కోరారు. అది జరిగిన నెలలోపే రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. విచారణ, వాదనలు, శిక్ష.. అంతా వేగంగా పూర్తి చేసి 8 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు... పార్లమెంటు నుంచి బయటకు తోసేయండి అని హుకుం జారీ చేశారు. కావాలంటే నాపైనా కేసు పెట్టి జైలుకు పంపించుకోవచ్చు. ఇప్పటికైనా మీడియా దేశంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజల ముందుంచాలి. నిజానికి రక్షణ కల్పించాలి. దేశం ప్రమాదంలో ఉంది కాబట్టి అందరూ ఒక్కటవ్వాలి’ అని ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో ఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తూ మోదీ ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. కాంగ్రెస్‌ను కొందరు బలహీన పార్టీ అనుకుంటున్నారని, కానీ అహంకారంతో మమ్మల్ని దెబ్బతీయాలని చూసేవారికి మూతిపగులగొట్టే సమాధానం చెప్పే శక్తి దానికి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాడుతూనే ఉంటామని చెప్పారు. కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలకు గుజరాత్‌లో కేసు పెట్టారని, ప్రధానికి ధైర్యం ఉంటే కర్ణాటకలోనే కేసు పెట్టి చూపించాల్సిందని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ ఓబీసీలను అవమానించారని భాజపా నేతలు అంటున్నారని, నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ ఓబీసీలా అన్ని ప్రశ్నించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు చిదంబరం, సల్మాన్‌ ఖుర్షీద్‌, జైరాం రమేశ్‌, పవన్‌ కుమార్‌ బన్సల్‌, ముకుల్‌ వాస్నిక్‌, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


రాజ్‌ఘాట్‌లో అనుమతివ్వని పోలీసులు

దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సత్యాగ్రహ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రాజ్‌ఘాట్‌ బయటే పార్టీ ఆందోళన నిర్వహించింది. శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ సమస్యల దృష్ట్యా రాజ్‌ఘాట్‌ దగ్గర సత్యాగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వలేమని తెలియజేస్తూ దిల్లీ పోలీసులు కాంగ్రెస్‌ పార్టీకి లేఖ రాశారు. అలాగే ఆ ప్రాంతంలో సెక్షన్‌ 144 విధిస్తున్నట్లు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని