అధికారం అడ్డంపెట్టుకుని అడ్డగోలు దోపిడీ: కోదండరాం

అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర పాలకులు అడ్డగోలు దోపిడీ చేస్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు.

Published : 27 Mar 2023 03:42 IST

బాలసముద్రం, న్యూస్‌టుడే: అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర పాలకులు అడ్డగోలు దోపిడీ చేస్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో ఆదివారం నిర్వహించిన ‘తెలంగాణ బచావో సదస్సు’లో ఆయన మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ అంశం అవినీతికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. ఒక ప్రశ్నపత్రం బయటకు వస్తే లీకేజీ అంటారని, ఎక్కువ పత్రాలు బయటకొస్తే దాన్ని వ్యాపారం అంటారని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాలను అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారని, తెర వెనక పెద్దల హస్తం ఉంటేనే ప్రశ్నపత్రాలు బయటకు వస్తాయని ఆరోపించారు. లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక ప్రజాస్వామిక వేదిక కన్వీనర్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కావాల్సింది బర్రెలు, గొర్రెలు కాదని.. మెరుగైన విద్య, వైద్యం అందిస్తే బాగుపడతారని చెప్పారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరమన్నారు.  కేయూ విశ్రాంత ఆచార్యుడు కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన సదస్సులో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు విమలక్క, సంగంరెడ్డి పృథ్విరాజ్‌, పుల్లూరు సుధాకర్‌, సోమ రామ్మూర్తి, అంబటి శ్రీనివాస్‌, డాక్టర్‌ జగదీశ్వర్‌ ప్రసాద్‌, కేయూ విద్యార్థి నేతలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని