కాంగ్రెస్‌ సత్యాగ్రహం.. మహాత్మునికి అవమానం: భాజపా

‘సంకల్ప సత్యాగ్రహ’ పేరుతో ఆదివారం కాంగ్రెస్‌ నిర్వహించిన కార్యక్రమం ఆ పార్టీ అహంకారాన్ని, క్రమశిక్షణారాహిత్యాన్ని చాటుతోందని భాజపా విమర్శించింది.

Updated : 27 Mar 2023 06:04 IST

దిల్లీ: ‘సంకల్ప సత్యాగ్రహ’ పేరుతో ఆదివారం కాంగ్రెస్‌ నిర్వహించిన కార్యక్రమం ఆ పార్టీ అహంకారాన్ని, క్రమశిక్షణారాహిత్యాన్ని చాటుతోందని భాజపా విమర్శించింది. రాజ్యాంగానికి, న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా పోరాడడం మహాత్మాగాంధీకి అవమానకరమని పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాజిక అవసరాల కోసం మహాత్ముడు సత్యాగ్రహాలు చేస్తే కాంగ్రెస్‌ నేతలు మాత్రం వ్యక్తిగత కారణాలతో వాటిని చేపడుతున్నారని చెప్పారు. ‘‘న్యాయప్రక్రియను అనుసరించిన తర్వాతే కోర్టులో రాహుల్‌గాంధీకి శిక్షపడింది. తదనుగుణంగా ఆటోమేటిగ్గా అనర్హత వేటు పడింది. మరి సత్యాగ్రహం ఎందుకు? దేశంలో బీసీలను కించపరచడాన్ని సమర్థించుకునేందుకా.. శిక్ష విధించిన కోర్టును తప్పు పట్టేందుకా.. అనర్హతకు వీలు కల్పించిన చట్ట నిబంధనకు వ్యతిరేకంగానా?’’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్‌ వివణ ఇవ్వాలన్నారు. సామాన్య ప్రజలకు ఒకరకంగా, తమకి మరో రకంగా చట్టాలు ఉండాలన్నట్లు గాంధీ కుటుంబం భావిస్తోందని, కోర్టులు ఏ ప్రాతిపదికన ఎలాంటి తీర్పులు వెలువరించాలో కూడా ఆ కుటుంబం నిర్ణయిస్తుందని ఎద్దేవాచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని