దర్యాప్తుపై నమ్మకం లేదు.. విచారణకు రాలేకపోతున్నా!

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Published : 27 Mar 2023 03:42 IST

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌కు బండి సంజయ్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఆయన పలు ఆరోపణలు చేశారు. దీనిపై.. లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ పోలీసులు సంజయ్‌కు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. ఆదివారం సంజయ్‌ హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంది. ఆయన తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది, భాజపా లీగల్‌సెల్‌ మాజీ సమన్వయకర్త ఆంటోనిరెడ్డి, సీనియర్‌ న్యాయవాది, భాజపా లీగల్‌ సెల్‌ జాయింట్‌ సెక్రెటరీ జి.రామారావులు.. ఆదివారం సిట్‌ అధికారికి లేఖను అందజేశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గంట తరువాత బయటకొచ్చిన వారు మాట్లాడుతూ.. తమ సమాధానాలతో అధికారులు సంతృప్తికరంగా ఉన్నారని, అవసరమైతే మళ్లీ నోటీసులు ఇస్తామని చెప్పారన్నారు. సిట్‌ అధికారులకు ఇచ్చిన లేఖలో సంజయ్‌ పేర్కొన్న అంశాలు.. ‘‘టీఎస్‌పీఎస్సీ లీకేజీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్‌పై నాకు నమ్మకం లేదని గతంలోనే చెప్పాను. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్నట్టు చెప్పినా రెండోసారి నోటీసులు జారీచేశారు. హేతుబద్ధమైన కారణాలతోనే మీరు ఖరారు చేసిన తేదీకి హాజరు కాలేకపోతున్నానని చెప్పడానికి నేనేమీ సంకోచించడం లేదు. నాకు నోటీసులు పంపడం వెనుక కారణాలను ఊహించుకోగలను. గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీ యావత్‌ రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది. దీనివెనుక కేవలం ఇద్దరే ఉన్నారని ఓ బాధ్యతాయుతమైన రాష్ట్రమంత్రి వ్యాఖ్యానించారు. సిట్‌కు నాయకత్వం వహిస్తున్న మీకు ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న వారెంత పెద్దసంఖ్యలో ఉన్నారనేది తెలుసు. భాజపా అధ్యక్షుడిగా వేర్వేరు మార్గాల ద్వారా నాకు వివరాలు అందాయి.. ఒక గ్రామం నుంచి పెద్దసంఖ్యలో అభ్యర్థులు పరీక్షలో అర్హత సాధించారని నాకు సమాచారం వచ్చింది. ప్రజాప్రతినిధిగా దీన్ని ప్రజల ముందుంచాల్సిన బాధ్యత నాపై ఉంది. వీటిపై దర్యాప్తు చేయాల్సిన మీరు(సిట్‌) దాన్ని పక్కనపెట్టి.. మీ ముందు హాజరవ్వాలంటూ పదేపదే నోటీసులు జారీ చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల కారణంగా మార్చి 26న నేను సిట్‌ విచారణకు హాజరు కాలేకపోతున్నా’’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని