దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

ప్రధాని మోదీ  దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

Published : 27 Mar 2023 04:52 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: ప్రధాని మోదీ  దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. అదానీ వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ అడిగితే ఎందుకు వేయరు? అని ప్రశ్నించారు. మోదీ అవినీతిపై నిలదీసినందుకు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేస్తారా? అని మండిపడ్డారు. మోదీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, అదానీ అవినీతిపై అంబేడ్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14 నుంచి మే 15వ తేదీ వరకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగస్వాములవుతామని వెల్లడించారు. ప్రపంచమంతా అదానీ అవినీతి అంశాలను మాట్లాడుకుంటుంటే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టి, అదానీకి భూములు కట్టబెట్టారని మండిపడ్డారు. వెడ్డింగ్‌ కార్డు పేరుతో అదానీ-జగన్‌ మధ్య జరిగిన నాలుగు గంటల భేటీ వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.  

పోలవరం సమస్యపై సామూహిక దీక్షలు

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. దీనిపై సీఎం ప్రశ్నించాలని, అఖిలపక్షం బృందాన్ని దిల్లీకి తీసుకువెళ్లి ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేశారు. పోలవరం సమస్యపై ఈ నెల 27, 28వ తేదీల్లో కలెక్టరేట్‌ల ఎదుట సామూహిక దీక్షలు, 28న విశాఖ, 29న అనంతపురంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, కె.వి.వి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కులగణన చేపట్టాలంటూ ముఖ్యమంత్రికి సీపీఐ లేఖ

దేశంలో 1931 సంవత్సరం తర్వాత కులగణన జరగలేదని, జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరైన రిజర్వేషన్లు లేక, అవకాశాలు పొందలేక, అభివృద్ధికి దూరమవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. కుల గణన లేకుండా.. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలు, సమన్యాయం వంటివి కుదరవని తెలిపారు. సమగ్ర కుల గణన చేయాలని కోరుతూ ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. కులాల పరిస్థితి? జనాభా? ఎవరికి బీసీ అర్హత ఉంది? వంటి మౌలిక ప్రశ్నలకు కుల గణనలో సమాధానం లభిస్తుందని చెప్పారు. ఈ విషయమై సీపీఐ ఇప్పటికే కేంద్రాన్ని కోరిందని గుర్తు చేశారు. బిహార్‌, ఒడిశాల తరహాలో రాష్ట్రం వెంటనే కుల గణన ప్రారంభించాలని లేఖలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని