డీఎస్‌ కుటుంబంలో రాజకీయ రచ్చ

నిజామాబాద్‌ జిల్లా సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) కాంగ్రెస్‌లో చేరిక అంశం సోమవారం ఆసక్తికర మలుపు తిరిగింది.

Updated : 28 Mar 2023 04:56 IST

కాంగ్రెస్‌లో చేరికపై గందరగోళం
ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని డి.శ్రీనివాస్‌ ప్రకటన
అర్వింద్‌ ఒత్తిడి వల్లే ఇలా చేశారని పెద్ద కుమారుడి ఆరోపణ

 

ఈనాడు, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) కాంగ్రెస్‌లో చేరిక అంశం సోమవారం ఆసక్తికర మలుపు తిరిగింది. డీఎస్‌తో పాటు ఆయన పెద్ద కుమారుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ గాంధీభవన్‌లో ఆదివారం పార్టీలో చేరారని కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో చేరిన అంశంపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి సోమవారం భిన్నస్వరాలు వినిపించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసినట్టుగా చెబుతున్న లేఖ సోమవారం బయటికొచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్‌ను రాజకీయాలకు వాడుకోవద్దంటూ మీడియాకు విడుదల చేసిన లేఖ, వీడియోలో ఆయన సతీమణి కోరగా.. ఆయనను చేర్చుకున్న విధానం సరికాదని చిన్న కుమారుడు, భాజపా ఎంపీ అర్వింద్‌ ఆక్షేపణ తెలిపారు. మరోవైపు, తనతో పాటు తన తండ్రి కాంగ్రెస్‌లో చేరిన మాట వాస్తవమేనని సంజయ్‌ పేర్కొనడం గమనార్హం.

వివాదాల్లోకి లాగొద్దు: డీఎస్‌

సంజయ్‌ చేరిక సందర్భంగా గాంధీభవన్‌కు వెళ్తే.. తానూ చేరినట్లు ప్రచారం జరుగుతోందని ఖర్గేకు రాసిన లేఖలో డీఎస్‌ పేర్కొన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదినేనని, అయితే అనారోగ్య సమస్యల దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని అందులో పేర్కొన్నారు. తనను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేస్తూ.. ఒకవేళ తాను చేరినట్లు భావిస్తే ఇదే రాజీనామాగా భావించి ఆమోదించాలనీ కోరారు. కాగా, డీఎస్‌ సతీమణి విజయలక్ష్మి మీడియాకు ఓ లేఖ, వీడియో విడుదల చేశారు. ‘పక్షవాతం సమస్యతో బాధపడుతున్న ఆయనను దయచేసి రాజకీయాల కోసం వాడుకోవద్దు. నిన్న ఒత్తిడికి గురిచేయటంతో ఫిట్స్‌ వచ్చాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ప్రశాంతంగా బతకనీయండి’ అని అందులో కోరారు. ఇదే అంశంపై విలేకరులతో మాట్లాడిన సంజయ్‌ మరో వాదన వినిపించారు. తన తండ్రి, తాను ఆదివారం కాంగ్రెస్‌లో విలేకరుల సమక్షంలోనే చేరామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయన్నారు. తన తండ్రి 3 గంటల పాటు గాంధీభవన్‌లో గడిపారన్నారు. తన తండ్రి రాసినట్లుగా బయటకు వచ్చిన లేఖలను నమ్మొద్దని ఆయన కోరారు. ఇదంతా భాజపా ఎంపీగా ఉన్న తన కుటుంబ సభ్యుడు చేయిస్తున్న పని అంటూ పరోక్షంగా తన సోదరుడు అర్వింద్‌పై ఆరోపణలు చేశారు. దగ్గరుండి ఆయనపై ఒత్తిడి చేసి లేఖ రాయించారన్నారు. ఈ విషయం తన దృష్టికి రావటంతో తన తండ్రితో ఫోన్లో మాట్లాడగా.. రాజీనామా చేసినట్లు చెప్పలేదన్నారు.

రాజీనామా వివాదంతో సంబంధం లేదు: అర్వింద్‌

తన తండ్రి రాజీనామా వివాదంతో తనకు సంబంధం లేదని భాజపా ఎంపీ అర్వింద్‌ స్పష్టంచేశారు. ఈమేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఆయనను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలనుకుంటే సోనియా గాంధీ స్వయంగా ఇంటికి పిలిపించి కండువా కప్పుతారన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ సరిగా మాట్లాడలేని వ్యక్తి, మాట్లాడిన విషయాలు గుర్తుంచుకోలేని వ్యక్తిని చేర్చుకోవటం సమంజసం కాదనేది తన అభిప్రాయమన్నారు. ఆయన రాజకీయాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని