దొంగ ఓట్లతోనే గెలిచేవాడిని

ఎప్పుడు ఎన్నికలు జరిగినా తన ఊరు(చింతలమోరి)లోని ఒక పోలింగ్‌ కేంద్రంలో వేసే దొంగ ఓట్లతోనే తాను గెలిచేవాడినని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 28 Mar 2023 09:23 IST

సంచలనంగా మారిన ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలు

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: ఎప్పుడు ఎన్నికలు జరిగినా తన ఊరు(చింతలమోరి)లోని ఒక పోలింగ్‌ కేంద్రంలో వేసే దొంగ ఓట్లతోనే తాను గెలిచేవాడినని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈ నెల 24వ తేదీ రాత్రి జరిగిన వైకాపా ఆత్మీయ సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. చింతలమోరిలోని ఒక పోలింగ్‌ బూత్‌లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయని, ఎన్నికలు జరిగినప్పుడల్లా ఒక బ్యాచ్‌ (15 నుంచి 20 మంది) దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారని తెలిపారు. ఒక్కొక్కరు 5 నుంచి 10 ఓట్లు వేసేవారన్నారు. ఈ దొంగ ఓట్లే తన విజయానికి సహకరించేవని, 800కు పైగా మెజారిటీ వచ్చేదన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

కావాలనే వక్రీకరిస్తున్నారు: ఎమ్మెల్యే రాపాక

రాజోలు, న్యూస్‌టుడే: 32 ఏళ్ల క్రితం అలా జరిగేదని మాత్రమే తాను ఆ సమావేశంలో అన్నానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. దొంగ ఓట్లకు సంబంధించిన వ్యాఖ్యలపై ‘న్యూస్‌టుడే’ ఆయనను వివరణ కోరగా తాను అన్న మాటలను కావాలనే వక్రీకరిస్తున్నారని అన్నారు. తన సన్నిహితులు కొద్దిమంది స్వగ్రామం చింతలమోరి వచ్చినప్పుడు.. ఇలా వచ్చారేంటని అడిగితే దొంగ ఓట్లు వేయడానికి వచ్చామని సరదాగా సంభాషించేవారని, ఆ విషయాన్ని సమావేశంలో పంచుకున్నట్లు చెప్పారు. దీన్ని వక్రీకరించి, ఇటీవలే దొంగ ఓట్లతో గెలిచినట్లు చెప్పానని ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ సమావేశంలో జనసేన పార్టీ ప్రస్తావనే తీసుకురాలేదని, తెదేపా క్రాస్‌ ఓటింగ్‌ గురించి మాత్రమే మాట్లాడానని ఎమ్మెల్యే రాపాక వివరించారు.

నేను చెప్పిన మాటే నిజమైంది: బొంతు రాజేశ్వరరావు

మామిడికుదురు, న్యూస్‌టుడే: రాజోలు అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచినట్లు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్వయంగా ఒప్పుకోవడంతో... గతంలో ఎన్నికల అనంతరం తాను చేసిన ఆరోపణలు నిజమయ్యాయని జనసేన నాయకుడు బొంతు రాజేశ్వరరావు అన్నారు. గత ఎన్నికల్లో ఆయన మూడు వేల వరకు దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. పూర్తి ఆధారాలతో ఎన్నికల సంఘానికి, హైకోర్టుకు వెంటనే ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ అవి విచారణలో ఉన్నాయన్నారు. దొంగ ఓట్లతో గెలిచానని అంతర్వేదిలో స్వయంగా రాపాక ఒప్పుకున్న విషయాన్ని మళ్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.

వాస్తవమని రుజువైంది: మాజీ మంత్రి గొల్లపల్లి

దొంగ ఓట్లతోనే తాను నెగ్గినట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్వయంగా చెప్పడంతో అది వాస్తవమన్న విషయం రుజువైందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మామిడికుదురులో సోమవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 4,500 దొంగ ఓట్లు ఆయన వేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని