నకిలీ డిగ్రీ పట్టాతో తమ్మినేని లా అడ్మిషన్‌!

శాసనసభాపతి తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్‌ తీసుకున్నారని, ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఫిర్యాదు చేశారు.

Updated : 28 Mar 2023 06:35 IST

శాసనసభాపతి సీతారాంపై చర్యలు తీసుకోండి
తెదేపా నేత కూన రవికుమార్‌ ఫిర్యాదు
రాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు సీజేలకు, ముఖ్యమంత్రి జగన్‌కు లేఖలు

ఈనాడు, అమరావతి-గుజరాతీపేట (శ్రీకాకుళం),న్యూస్‌టుడే: శాసనసభాపతి తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్‌ తీసుకున్నారని, ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గవర్నర్లు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, తమిళిసై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి జగన్‌లకు ఈ మేరకు ఆయన సోమవారం లేఖలు రాశారు. ‘‘తమ్మినేని సీతారాం శాసనసభాపతిగా ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న మహాత్మాగాంధీ లా కాలేజీలో 2019-20 విద్యా సంవత్సరంలో మూడేళ్ల లా కోర్సులో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో అడ్మిషన్‌ తీసుకున్నారు. అది ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధ కళాశాల. నిబంధనల ప్రకారం మూడేళ్ల లా కోర్సులో చేరాలంటే డిగ్రీ లేదా తత్సమానమైన కోర్సును పూర్తి చేసి ఉండాలి. సీతారాం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయలేదు. ఆ విషయాన్ని గతంలో ‘ఐ డ్రీమ్‌’ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లోను ఆయన ఆ విషయాన్ని పేర్కొన్నారు. తన అత్యున్నత విద్యార్హత ఇంటర్మీడియెట్‌ అని, శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతూ మధ్యలో చదువు మానేశానని ఆయన చెప్పారు...’’ అని రవికుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమ్మినేనికి ఏమైనా ప్రత్యేక అనుమతి ఇచ్చారా?

‘‘డిగ్రీ కోర్సు పూర్తి చేయకుండానే మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు తమ్మినేని వంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకమైన అనుమతేమైనా ఇచ్చారా? ఆయన 2019-20లో లా పరీక్షలకు (హాల్‌ టికెట్‌ నెం.172419831298) కూడా హాజరయ్యారు. ఆ వార్త అప్పట్లో ఒక దినపత్రికలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సంచికల్లో ప్రచురితమైంది...’’ అని రవికుమార్‌ పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ని, తమ్మినేని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ని ఆయన తన లేఖలకు జత చేశారు. ‘‘తమ్మినేని సీతారాం కేవలం ఆమదాలవలస నియోజకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా శాసనసభ్యులందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి... నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్‌ తీసుకోవడం వంటి తప్పుడు పనులు చేయడం తగదు. ఆయన విలువలకు, నైతిక ప్రవర్తనకు కట్టుబడలేదు. ఆయన చేసిన పని న్యాయవిరుద్ధం, శిక్షార్హం...’’ అని రవికుమార్‌ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య, నైతిక విలువలకు కట్టుబడి ఉండేలా చూసేందుకు, చట్టం ముందు అందరూ సమానులేనని సమాజానికి సందేశం ఇచ్చేందుకు తమ్మినేని సీతారాంపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీకాకుళంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీనిపై స్పీకర్‌ స్పందించి ఆయన విద్యార్హతలు తెలియజేయాలన్నారు. అలాగే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సీఐడీతో విచారణ చేయించి వాస్తవాలు బయటపెట్టాలని రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని