మిమ్మల్ని కిడ్నాప్‌ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

వైకాపాకు చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మంగళవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పర్యటించారు.

Updated : 29 Mar 2023 08:51 IST

ఈనాడు, అమరావతి: వైకాపాకు చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మంగళవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పర్యటించారు. కాన్పుల వార్డును పరిశీలించారు. అక్కడ ఓ మహిళా అధికారిని ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘రోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మిమ్మల్ని కిడ్నాప్‌ చేస్తా’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల్ని నొప్పించాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆచార్య ప్రభావతి సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఎమ్మెల్యే ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లగానే ఉద్యోగులు విధుల బహిష్కరణకు సమాయత్తమయ్యారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతికి విషయం తెలియడంతో ఎమ్మెల్యేను మరోసారి ఆసుపత్రికి పిలిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. ఆసుపత్రికి వచ్చేవారిలో చాలా మంది నిరుపేదలు. అలాంటి వారి నుంచి కాన్పుల వార్డులో మగ పిల్లాడైతే రూ.1500, ఆడపిల్ల పుడితే రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని రేట్లు ఫిక్స్‌ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. బలవంతపు వసూళ్లపై ఇద్దరు, ముగ్గురు బాధితులు నా వద్ద మొరపెట్టుకున్నారు. వారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడానికి ఆస్పత్రికి వచ్చా తప్ప ఎవరినో కించపరచడానికో భయపెట్టడానికో కాదు’ అని వివరణ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని