40 శాతం టికెట్లు యువతకే

వచ్చే ఎన్నికల్లో 40% టికెట్లను యువతకు కేటాయించాలని తెదేపా పొలిట్‌బ్యూరో తీర్మానించింది. మే 27, 28 తేదీల్లో పార్టీ మహానాడును రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.

Published : 29 Mar 2023 02:53 IST

వచ్చే మహానాడు రాజమహేంద్రవరంలో
ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లో 100 చోట్ల ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు
రూ.5వేలు కట్టినవారికి పార్టీ శాశ్వత సభ్యత్వం
తెదేపా పొలిట్‌బ్యూరో నిర్ణయాలు

ఈనాడు-హైదరాబాద్‌, అమరావతి: వచ్చే ఎన్నికల్లో 40% టికెట్లను యువతకు కేటాయించాలని తెదేపా పొలిట్‌బ్యూరో తీర్మానించింది. మే 27, 28 తేదీల్లో పార్టీ మహానాడును రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్ని మే 28 వరకు 100 ప్రాంతాల్లో నిర్వహించనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాల్లోను, అండమాన్‌ నికోబార్‌ దీవులు, విదేశాల్లో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో రూపకల్పన, మహానాడుకు సన్నాహాలు, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల నిర్వహణకు పార్టీ మూడు ప్రత్యేక కమిటీల్ని నియమించనుంది. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో జరిగింది. సుమారు మూడు గంటలు జరిగిన సమావేశంలో... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 అంశాలు, తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత ప్రభుత్వాలు అన్నివర్గాల ప్రజల్ని మోసం చేశాయని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. విభజన హామీలు నెరవేరేలా చూడటంలో ఇద్దరు ముఖ్యమంత్రులూ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తెస్తానని యువతను నమ్మించిన జగన్‌, వారిని దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తింది. ఏపీలో అధికారపార్టీ నాయకుల వేధింపులు, భౌతిక దాడులతో... ఆర్థికంగానూ దెబ్బతిన్న పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఆదుకునేందుకు తెదేపా మద్దతుదారులు, సానుభూతిపరుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రెండేళ్లకోసారి చేపడుతున్న పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, రూ.5వేలు, ఆపైన చెల్లించినవారికి శాశ్వత సభ్యత్వం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలను భారీస్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండు చేసింది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం వంద రూపాయల నాణేన్ని విడుదల చేయాలన్న కేంద్ర నిర్ణయంపై హర్షం వెలిబుచ్చింది. ఏపీలో ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, ఎమ్మెల్యేల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానంలో విజేతలను అభినందిస్తూ పొలిట్‌బ్యూరో తీర్మానం ఆమోదించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని పార్టీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి విలేకర్లకు తెలిపారు. ముఖ్యాంశాలు...

ప్రజల్లోకి మేనిఫెస్టో కమిటీ

పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తుంది. ఇప్పుడు అందుతున్న సంక్షేమపథకాలకు మించి లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో ఉండాలని చంద్రబాబు సూచన.

ఇంటింటికీ తెదేపా చరిత్ర

41 సంవత్సరాల తెదేపా ప్రస్థానం నేటి యువతకు తెలియాలి. అందుకోసం పార్టీ చరిత్రను ఇంటింటికీ తెలియజేయాలి. తెదేపా ఆవిర్భావానికి ముందు, తర్వాత తెలుగుజాతి ఎలా ఉందన్న అంశంపై చర్చించాలి. తెదేపా ఆవిర్భావానికి ముందు ప్రజలు ఓట్లేసే యంత్రాలుగానే ఉండేవారు. సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించేది కాదు. తెదేపా వచ్చాకే ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్‌ ఆద్యులు. దశాబ్దాల నుంచి ప్రజల్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు తెదేపా పరిష్కారం చూపింది.

కష్టపడేవారికే అవకాశం

* పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించాలని, వారి సేవల్ని మెరుగ్గా ఉపయోగించుకోవాలని నిర్ణయం. పైరవీలు చేసేవారికి, ‘ఫొటోగ్రాఫిక్‌ నాయకత్వానికి’ తావులేకుండా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం.
* పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేస్తున్న యువగళం పాదయాత్రపై చర్చ. విజయవంతంగా సాగుతోందని, యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అభిప్రాయం.
* ఏపీలో ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా తనను ప్రశ్నించకూడదన్న అక్కసుతోనే జగన్‌ జీవో నం.1 తీసుకొచ్చారని ధ్వజం. ఆ జీవోను తీవ్రంగా ఖండించిన పొలిట్‌బ్యూరో. జగన్‌రెడ్డి తన తప్పు అంగీకరించి, లెంపలేసుకుని వెనక్కి తీసుకోవాలని డిమాండు.

రైతుల ముఖం చూడని జగన్‌

* ఏపీలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయినా, ఇప్పటి వరకూ సీఎం జగన్‌ వారి ముఖం చూడలేదని ధ్వజం. రైతుల్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండు.
* ఏపీలో విద్యుత్‌ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు, చెత్తపన్ను... ఇతరత్రా పన్నుల పెంపుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ధ్వజం

తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని తెదేపా నిర్ణయించింది. పొలిట్‌బ్యూరోలో చర్చించిన అంశాల్లో తెలంగాణకు సంబంధించి.. అకాల వర్షాలతో కష్టాల్లో రైతులు, హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యం, ఇంటింటికీ తెదేపా, సభ్యత్వ నమోదు అంశాలున్నాయి. పంటనష్టం గణనలో కాలం చెల్లిన విధానాల్ని పక్కనపెట్టాలని.. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని తెదేపా డిమాండు చేసింది. బయ్యారం, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ హామీలు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని, రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ చేపట్టాలని, నిరుద్యోగులకు రూ.3,116 భృతి, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండు చేసింది.

మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ

నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా రూ.100 నాణెం విడుదలకు చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రధానికి చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. ‘ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన్ను సన్మానించడం అంటే తెలుగువారిని గౌరవించడమే. ఈ సందర్భంగా తెలుగు ప్రజలు, తెదేపాతోపాటు వ్యక్తిగతంగా నా తరఫున మీకు ధన్యవాదాలు’ అని లేఖలో పేర్కొన్నారు.

నేడు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ సభ

తెదేపా 41వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో బుధవారం జరిగే ఈ సభను తెలంగాణ తెదేపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుంది.


జగన్‌ అరాచకపాలనతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి

* జగన్‌ పాలన అరాచకంగా ఉందని, అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ధ్వజం. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే తెదేపా అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని అభిప్రాయం. రాష్ట్రానికి గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టు జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో చిన్న బ్యారేజీగా మారే పరిస్థితి తలెత్తిందని ధ్వజం
* జగన్‌ సర్కారు ధనదాహం, దౌర్జన్యాలకు పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆగ్రహం.
* తెదేపా నిర్వహిస్తున్న ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు