ఓబీసీ పేరుతో భాజపా రాజకీయం

రాహుల్‌గాంధీ ఓబీసీలను అవమానించారంటూ భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్‌ ఆరోపించారు.

Published : 29 Mar 2023 05:09 IST

మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాహుల్‌గాంధీ ఓబీసీలను అవమానించారంటూ భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్‌ ఆరోపించారు. రాహుల్‌ అనర్హతపై కాంగ్రెస్‌ న్యాయపోరాటం చేయడంతోపాటు, ప్రజల్లోకి వెళ్లి పోరాడుతుందని ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలసి ఆయన ఇక్కడ ఒక హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌పై కేసు పెట్టిన భాజపా ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ కేసు విచారణ ఆపాలని గుజరాత్‌ హైకోర్టు నుంచి 2022 మార్చి 7న స్టే తెచ్చుకున్నారని, లోక్‌సభలో అదానీ, మోదీల మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూ రాహుల్‌ ప్రసంగించగానే గతనెల 16న స్టే రద్దు చేయించుకున్నారని ఆయనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన భారాస గురించి ఒక విలేకరి ప్రస్తావించగా.. మహారాష్ట్రలోకి కేసీఆర్‌కు స్వాగతమని అశోక్‌ చవాన్‌ అన్నారు. ‘మా జిల్లాకు ఆయన రెండుసార్లు వచ్చారు. ఆయన రాజకీయాలు ఆయనవి. కేసీఆర్‌ భాజపాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? లేక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. అయితే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును కేసీఆర్‌ ఖండించడాన్ని స్వాగతిస్తున్నా’ అని అన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, షబ్బీర్‌ అలీ, చామల కిరణ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.


రాష్ట్రంలో దుర్మార్గ పాలన: భట్టి విక్రమార్క

తాండూరు, న్యూస్‌టుడే: తెలంగాణలో దుర్మార్గ పాలన నడుస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల నడ్డివిరుస్తున్నాయని విమర్శించారు. భారాస ప్రభుత్వం నిధులు, నియామకాలు, ఉద్యోగాల కల్పన పేరిట 4కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. సింగరేణి ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికులకు పట్టాలిప్పిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్‌సాగర్‌రావు, కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు