స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాసం!

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపట్టడానికి సన్నద్ధమవుతోంది.

Updated : 29 Mar 2023 06:18 IST

రాహుల్‌ విషయంలో సభాపతి తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్‌

దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపట్టడానికి సన్నద్ధమవుతోంది. విపక్షాల ఐక్యతను పరిపుష్టం చేయడంపై దృష్టి సారించింది. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని అనర్హుడిగా ప్రకటించే విషయంలో సభాపతి పక్షపాతంతో వ్యవహరించారని కాంగ్రెస్‌ భావిస్తోంది. మంగళవారం నిర్వహించిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అవిశ్వాసాన్ని ప్రతిపాదించడంలో ఇతర విపక్షాల మద్దతు కూడగట్టాలని నేతలు నిర్ణయించారు. నిజానికి సోమవారమే దీనిని ప్రవేశపెట్టాలనుకున్నారు. ప్రస్తుత తరుణంలో ఇలాంటి చర్య చేపట్టడం వల్ల విపక్ష ఐక్యతకు భంగం కలగవచ్చని కొన్ని పార్టీలు తమ వ్యతిరేకతను వ్యక్తంచేయడంతో అలా చేయలేకపోయారు. రాహుల్‌పై కొన్నిగంటల వ్యవధిలోనే వేటువేసిన తీరును ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం ఉపయోగపడుతుందని కాంగ్రెస్‌ ఎంపీలు భావిస్తున్నారు. సభ సజావుగా సాగుతున్నప్పుడే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. దీనికి కనీసం 50 మంది ఎంపీల సంతకాలు అవసరం. సభలో గందరగోళం ఉంటే మాత్రం తీర్మానానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఆ కారణంతో దీనిని తిరస్కరించే అవకాశం లేకపోలేదని విపక్ష శిబిరం భావిస్తోంది. ఈ నెల 13న రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి లోక్‌సభలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

నెలరోజుల పాటు ఆందోళన

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ మండలాల నుంచి జాతీయ స్థాయి వరకు నెలరోజుల పాటు రకరకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏప్రిల్‌ రెండోవారంలో ‘జై భారత్‌ మహా సత్యాగ్రహ’ కార్యక్రమాన్ని దిల్లీలో చేపట్టనుంది. మోదీ-అదానీ కలిసి దేశ సంపదను బాహాటంగా దోచుకుంటున్నారని, దీనిని ఎండగట్టడానికి ఆందోళన చేపడుతున్నామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్‌, కె.సి.వేణుగోపాల్‌ తెలిపారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాల ముందు ప్రదర్శనలు చేపట్టడం, ప్రధానికి పోస్టుకార్డులు రాయడం వంటివి వచ్చేనెలలో ఉంటాయని వివరించారు. నిరసనల్లో భాగంగా మంగళవారం ఎర్రకోట వద్ద ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్టీల జాతీయాధ్యక్షులతో భేటీ

2024 సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా వాటి జాతీయాధ్యక్షులతో త్వరలో భేటీ నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. పార్లమెంటులో కనపరిచిన ఐక్యతను బయటా కొనసాగించాలని ఇప్పటికే వ్యక్తమైన అభిప్రాయం మేరకు దీనికి ఏర్పాట్లు చేస్తోంది. విపక్షాలకు చెందిన శరద్‌పవార్‌, టి.ఆర్‌.బాలు, లలన్‌సింగ్‌ వంటి నేతలు చేసిన సూచనను పార్టీ పరిగణనలో తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని