విజయాలు సాధిస్తున్నకొద్దీ మనపై రాళ్లు
ఎన్నికల్లో అధికార పార్టీ విజయాలు సాధిస్తున్నకొద్దీ విపక్షాలు తమను లక్ష్యంగా చేసుకుని నిరసనలు వ్యక్తపరుస్తూ ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.
రాజ్యాంగ సంస్థల్ని దెబ్బతీయాలని విపక్షాల యత్నం: మోదీ
దిల్లీ: ఎన్నికల్లో అధికార పార్టీ విజయాలు సాధిస్తున్నకొద్దీ విపక్షాలు తమను లక్ష్యంగా చేసుకుని నిరసనలు వ్యక్తపరుస్తూ ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఈ విషయాన్ని గుజరాత్ ఎన్నికల సమయంలోనే తాను ప్రస్తావించానని గుర్తుచేశారు. తమపై పోరుకు అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారని ఆరోపించారు. విపక్షాల నిరసనల్ని తిప్పికొట్టేరీతిలో పనిచేయాలనీ, పార్టీ వ్యవస్థాపక దినమైన ఏప్రిల్ 6 నుంచి అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకు ‘సామాజిక న్యాయం’ కోసం కేటాయించాలని పార్టీ ఎంపీలను కోరారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 15 నుంచి నెలరోజుల పాటు ప్రభుత్వ పథకాలపై భాజపా ఎంపీలు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని సూచించారు. మంగళవారం దిల్లీలో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భాజపా ప్రధాన కార్యాలయంలో విస్తరించిన పనులను ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాల్లో మాట్లాడినప్పుడు విపక్షాలపై మండిపడ్డారు.
దేశవ్యతిరేక శక్తులు చేతులు కలుపుతున్నాయ్
అవినీతికి వ్యతిరేకంగా గతంలో ఎవ్వరూ చేయని రీతిలో తమ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తుండడంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయని మోదీ చెప్పారు. తప్పుడు అభియోగాలు తమను అడ్డుకోలేవనీ, అవినీతిపరులపై చర్యల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టంచేశారు. ‘‘దేశం వివిధ రంగాల్లో బలోపేతమవుతున్న తరుణంలో ఇంటాబయటా ఉన్న దేశ వ్యతిరేక శక్తులు చేతులు కలపడం సహజమే. ‘అవినీతిని పరిరక్షించాల’నే ఉద్యమాన్ని కొన్ని పార్టీలు ప్రారంభించాయి! అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదు. రాజ్యాంగ సంస్థలే దేశానికి పునాది కావడంతో దేశ వ్యతిరేక శక్తులు వాటిపైనా దాడికి తెగబడుతున్నాయి. న్యాయ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల ప్రతిష్ఠను మసకబార్చాలని, వాటి విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తున్నాయి. అవినీతిపరులపై సంబంధిత సంస్థలు చర్యలు చేపడితే వాటిని వారు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమకు నచ్చని తీర్పులు వస్తే కోర్టులనూ ప్రశ్నిస్తున్నారు. అవినీతిపై మేం చర్యలు చేపట్టడమే కొందరికి ఆగ్రహం కలిగిస్తోంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద 2004-14 మధ్య యూపీఏ పాలనలో రూ.5,000 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేస్తే మా తొమ్మిదేళ్ల పాలనలో అది రూ.1.10 లక్షల కోట్లకు చేరింది. కేసులు రెట్టింపునకు పైగా, అరెస్టులు 15 రెట్ల మేర పెరిగాయి. అప్పట్లో బ్యాంకుల్ని దోచుకుని రూ.22,000 కోట్లను దిగమింగేస్తే మేం రూ.20,000 కోట్ల ఆస్తుల్ని జప్తు చేయించాం’’ అని చెప్పారు. గతంలో తనను కారాగారానికి పంపించాలని అనేక కుట్రలు జరిగినా అవి విఫలమయ్యాయనీ, ప్రజాశీస్సులతో ఉన్నతస్థానానికి ఎదిగానని చెప్పారు.
దేశవ్యాప్త పార్టీ భాజపా ఒక్కటే
కుటుంబాల చేతుల్లో ఉన్న పార్టీలతో పోలిస్తే దేశవ్యాప్తంగా విస్తరించిఉన్నది భాజపా ఒక్కటేనని మోదీ చెప్పారు. అనేక అవరోధాలను అధిగమించి, ప్రజలతో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. చిన్నస్థాయి నుంచి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదగడం వెనుక అనేకమంది కార్యకర్తల త్యాగాలు, అంకితభావం ఉన్నాయని కొనియాడారు. కేవలం రెండు లోక్‌సభ సీట్లతో మొదలై 2019లో 303 సీట్లకు చేరుకోవడంతో పాటు అనేక రాష్ట్రాల్లో 50% పైగా ఓట్లు సాధించామని చెప్పారు. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న భాజపా అటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లోనూ ఎదుగుతోందన్నారు. ఈశాన్యం సహా దేశం నలుమూలలకూ విస్తరిస్తున్నామని చెప్పారు. ధరిత్రిని పరిరక్షించుకునేందుకు కూడా పార్టీ నేతలు పాటు పడాలని ఆయన సూచించారు.
భాజపా ఓబీసీ ఎంపీల ర్యాలీ
మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్ని నిరసిస్తూ భాజపా ఓబీసీ ఎంపీలు పార్లమెంటు సముదాయం నుంచి విజయ్‌చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఓబీసీల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించేందుకు వచ్చేనెలలో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని వారు చెప్పారు. ఏప్రిల్ 6న మొదలయ్యే కార్యక్రమం ద్వారా దేశంలో కోటి కుటుంబాలను భాజపా కార్యకర్తలు చేరుకుంటారని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Train Accident: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
Movies News
Samantha: ప్రియాంక చోప్రా తల్లిగా సమంత.. సమాధానం వచ్చినా సందేహమే!
-
India News
1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!