క్షమాపణ చెబుతారా? రూ. 100 కోట్ల దావా ఎదుర్కొంటారా?

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్‌ మంగళవారం లీగల్‌ నోటీసులు పంపారు.

Published : 29 Mar 2023 05:48 IST

రేవంత్‌, సంజయ్‌లకు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్‌ మంగళవారం లీగల్‌ నోటీసులు పంపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ వ్యవహారంలో తన పేరును అనవసరంగా లాగుతున్నారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే సంజయ్‌, రేవంత్‌రెడ్డిలు పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిపై అసత్యాలు మాట్లాడే హక్కు లేదన్నారు. వారిద్దరికీ తన న్యాయవాది ద్వారా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలను మానుకోవాలని.. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకుంటే.. రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని