దళితులపై రాష్ట్రంలో దమనకాండ

దళితులంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ లేదని, రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగుతోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 29 Mar 2023 06:16 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: దళితులంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ లేదని, రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగుతోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను పెత్తందారులతో పోరాడుతూ... పేదలు, దళితుల పక్షానే ఉన్నానంటూ సీఎం జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ అచ్చెన్నలను రాష్ట్ర ప్రభుత్వమే హత్య చేసిందని, ఇప్పుడు దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీదేవిపై దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై అమానుష దాడుల గురించి ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని చదివిన తర్వాత ఆందోళన కలుగుతోందన్నారు. దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని సామాజిక మాధ్యమాల వేదికగా వేధిస్తున్న వారిపై సైబర్‌ చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శ్రీదేవి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తుంటే... ఏం లేని దానికే సుమోటోగా కేసులు నమోదు చేసే ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల విషయంలో ఉండవల్లి శ్రీదేవి, రఘురామకృష్ణరాజుకు ఒక న్యాయం, జగన్‌మోహన్‌రెడ్డికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. కడపలోని రంగనాథ స్వామి మార్కెట్‌ యార్డ్‌ పేరును మార్చి వైఎస్సార్‌ మార్కెట్‌ యార్డ్‌గా నామకరణం చేయడం దారుణమన్నారు. పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి జరిగే ఎన్నికల్లో తాను నామినేషన్‌ దాఖలు చేశానని, తమ పార్టీ నుంచి ఇద్దరు పేర్లను ప్రతిపాదించారని రఘురామ తెలిపారు. ఎన్నిక జరిగితే తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని