Amit shah: కోర్టులో రాహుల్‌ అప్పీలు చేసుకోవాలి

క్రిమినల్‌ కేసుల్లో శిక్షలు పడి పదవులు కోల్పోయిన నేతలు చాలామంది ఉన్నారని, రాహుల్‌ ఒక్కరే కాదని, ఈ విషయాన్ని అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.

Updated : 30 Mar 2023 10:09 IST

ఇల్లు ఖాళీపై తొందరేం లేదు
ఆయన ఒక్కరే కాదు.. శిక్ష పడి పదవి కోల్పోయినవారు చాలామంది ఉన్నారు
అమిత్‌ షా వ్యాఖ్యలు

దిల్లీ: క్రిమినల్‌ కేసుల్లో శిక్షలు పడి పదవులు కోల్పోయిన నేతలు చాలామంది ఉన్నారని, రాహుల్‌ ఒక్కరే కాదని, ఈ విషయాన్ని అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. రాహుల్‌ ఎగువ కోర్టులకు వెళ్లి తన కేసుపై పోరాటం చేయాలని సూచించారు. దానిని వదిలేసి ప్రధానిపై అభాండాలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బుధవారం దిల్లీలో ఓ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘తన కేసులో స్టే తెచ్చుకోవడానికి రాహుల్‌ ప్రయత్నించలేదు. ఇదేం తెంపరితనం. కోర్టుకు వెళ్లకుండానే ఎంపీగా కొనసాగాలనుకుంటే ఎలా? ఈయన ఒక్కరే మొదటి వ్యక్తి కాదు. అంతకంటే పెద్ద పదవుల్లో ఉన్నవారు ఈ చట్టం కారణంగా అనర్హతకు గురయ్యారు. లాలూ ప్రసాద్‌, జయలలిత తదితర దాదాపు 17మంది అనర్హతకు గురయ్యారు. కాంగ్రెస్‌లో పేరుమోసిన న్యాయవాదులున్నారు. అందులో కొందరు రాజ్యసభలోనూ ఉన్నారు. న్యాయ విషయాల్లో రాహుల్‌కు వారు సలహాలివ్వాలి. ఇల్లు ఖాళీ చేయాలని ఆయనకు ఇచ్చిన నోటీసు సాధారణ ప్రక్రియే. అంత త్వరగా ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడేమీ లేదు’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు. గత యూపీఏ హయాంలో బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో మోదీని ఇరికించేందుకు తనపై సీబీఐ తీవ్రంగా ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని