భాజపాపై పోరుకు కలిసి రండి

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాపై పోరాటానికి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చారు.

Published : 30 Mar 2023 06:08 IST

రాజకీయ పార్టీలకు మమత పిలుపు

కోల్‌కతా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాపై పోరాటానికి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. బెంగాల్‌పై కేంద్రం వివక్ష కనపరుస్తోందని ఆరోపిస్తూ కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రెండ్రోజుల నిరసన దీక్షకు బుధవారం ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- 2024 సార్వత్రిక ఎన్నికలు దేశ ప్రజలకు, భాజపాకు మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు సహా అన్ని మతాలవారూ ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తిచేశారు. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటివాటినీ అమ్మకానికి పెట్టడం ద్వారా భాజపా దుష్టపాలన సాగిస్తోందని దునుమాడారు. ఇలాంటి సర్కారును ఇంటికి పంపించి, సామాన్యులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందిరా ఆవాస్‌ యోజన కింద మాకు రావాల్సిన నిధులను మోదీ సర్కారు నిలిపివేసింది. ఓబీసీ విద్యార్థుల ఉపకారవేతనాలు కూడా ఇవ్వట్లేదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. బెంగాల్‌పై కేంద్రం సవతి తల్లి వైఖరి ప్రదర్శిస్తోంది. అందుకే ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా నేనే ధర్నాకు దిగాను’’ అని దీదీ వెల్లడించారు. గురువారం సాయంత్రం వరకు దీక్ష కొనసాగనుంది. పరిపాలనపరమైన పనులకు ఆటంకం లేకుండా దీక్షా శిబిరం వద్దనే సీఎం తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని