సొంత పనుల కోసమే సీఎం దిల్లీ యాత్రలు

‘గత నాలుగేళ్లలో ఒక్క కాలువ కూడా తవ్వలేదు. సాగునీటికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులూ చేయలేదు.  ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేని ఎంపీలు మనకున్నారు.  

Published : 30 Mar 2023 04:42 IST

ఒంగోలు సదస్సులో కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ‘గత నాలుగేళ్లలో ఒక్క కాలువ కూడా తవ్వలేదు. సాగునీటికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులూ చేయలేదు.  ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేని ఎంపీలు మనకున్నారు.  వివేకానందరెడ్డి హత్య కేసులో తమ్ముడిని కాపాడుకునేందుకు, తన సొంత పనులు చక్కదిద్దుకునేందుకు మాత్రమే ముఖ్యమంత్రి జగన్‌ తరచూ దిల్లీ యాత్రలు సాగిస్తుంటారు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి- వెలిగొండ ప్రాజెక్టు’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం సొంత జిల్లాలోని గండికోటలో 26 టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వడానికి కాలువలు లేకపోవడం శోచనీయమన్నారు. సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి పోరాటం చేయనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ..ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోకుంటే  రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. కృష్ణానదీ జలాల నిర్వహణ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. 26 జిల్లాల్లోనూ సాగునీటి పారుదల ప్రాజెక్టులపై సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. సదస్సులో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణరావు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని