Raghurama: ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రయత్నం: రఘురామ

రాష్ట్రంలో పడిపోతున్న తమ పార్టీ గ్రాఫ్‌ చూసి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 30 Mar 2023 08:47 IST

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో పడిపోతున్న తమ పార్టీ గ్రాఫ్‌ చూసి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తెలంగాణతో పాటే ముందస్తు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందన్నారు. ఇక్కడ బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన, పోలవరం పెండింగ్‌ బిల్లుల కోసమే ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన అని పైకి చెబుతున్నా... అసలు కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జైలులో ఉన్న శివశంకర్‌ రెడ్డికి బెయిల్‌, కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌ రెడ్డి జైలుకు వెళ్లకుండా కాపాడడం కోసమే ఆయన దిల్లీ పర్యటన చేపడుతున్నారని రఘురామ ఆరోపించారు. అవినాష్‌ రెడ్డి జైలుకు వెళ్లినా అంతిమ విచారణ తమపైకి రాకుండా చూసుకోవాలని కేంద్ర పెద్దలను ముఖ్యమంత్రి కోరే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయన్నారు. తాను అనుకుంటున్న వారిని అరెస్టు చేసి ఆనందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, దానికి కేంద్రం అనుమతి కోసమే దిల్లీ పర్యటన అని తెలుస్తోందని రఘురామ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అరెస్టులకు కేంద్రం నుంచి అనుమతి అవసరం లేకపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని