కోర్టుకెళ్తే రాహుల్‌కూ ఊరట లభిస్తుందా?

రాహుల్‌ గాంధీపై పడ్డ అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లక్షద్వీప్‌ ఎంపీపై అనర్హతను తొలగిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Updated : 30 Mar 2023 06:10 IST

ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత నేపథ్యం

దిల్లీ: రాహుల్‌ గాంధీపై పడ్డ అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లక్షద్వీప్‌ ఎంపీపై అనర్హతను తొలగిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే తరహాలో రాహుల్‌పై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోతుందా? వయనాడ్‌ ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ పునరుద్ధరించక తప్పదా? తాజా పరిణామాల నేపథ్యంలో.. కొన్ని అంశాలు ఆయనకు కలిసొస్తే ఇవన్నీ సాధ్యమేనని స్పష్టమవుతోంది. 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం కేసుల్లో రెండేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.15వేల వరకూ జరిమానా విధించవచ్చు. సూరత్‌ కోర్టు ఈ కేసులో రాహుల్‌కు గరిష్ఠ జైలు శిక్ష విధించింది. శిక్ష అమలును 30 రోజులపాటు వాయిదా వేసి.. బెయిలు మంజూరు చేసింది. అయితే రాహుల్‌ కేసులో రెండేళ్ల శిక్ష అసాధారణమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ తనపై పడిన శిక్షను సవాలు చేస్తూ పై కోర్టుకు వెళ్లొచ్చు. పై కోర్టులు రాహుల్‌ గాంధీపై పడిన శిక్షను ఒక్క రోజు తగ్గించినా.. సూరత్‌ కోర్టు తీర్పును నిలిపేసినా.. శిక్షను పూర్తిగా రద్దు చేసినా.. ఆయనపై పడ్డ అనర్హత తొలగిపోతుంది. పై కోర్టుల్లో రాహుల్‌కు ఊరట లభించకపోతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ అలా జరిగే అవకాశాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్‌ గాంధీపై అనర్హత కొనసాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహించిన వయనాడ్‌ స్థానం ఖాళీ అయింది. రాహుల్‌పై శిక్షపడ్డ కేసును పై కోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతవరకూ కోర్టును ఆశ్రయించలేదని తెలుస్తోంది. మరోవైపు వయనాడ్‌ స్థానానికి అప్పుడే ఉప ఎన్నిక నిర్వహించే ఉద్దేశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు 6 నెలల సమయం ఉంటుందని బుధవారం కర్ణాటక ఎన్నికల షెడ్యూలు విడుదల సందర్భంగా గుర్తు చేసింది. న్యాయ సమీక్ష కోసం సూరత్‌ కోర్టు రాహుల్‌కు 30 రోజుల సమయం ఇచ్చిన నేపథ్యంలో ఆ గడువు పూర్తయ్యే వరకూ ఎదురు చూస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని