సంక్షిప్త వార్తలు (5)

జన గణనలో బీసీ కులాల గణన చేపట్టాలంటూ తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథావలె, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

Updated : 31 Mar 2023 06:35 IST

బీసీ కుల గణన ఉద్యమానికి మద్దతు ఇవ్వండి

ఈనాడు, దిల్లీ: జన గణనలో బీసీ కులాల గణన చేపట్టాలంటూ తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథావలె, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో వారిని సంఘం నాయకులతో శ్రీనివాస్‌గౌడ్‌ గురువారం వేర్వేరుగా కలిశారు.


తెదేపా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం నేడు

ఈనాడు, అమరావతి: మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పంచుమర్తి అనురాధ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు తన ఛాంబర్‌లో వీరితో ప్రమాణం చేయించనున్నారు.


ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, నదీ పరీవాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయని మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అమరావతి ఇసుక రీచ్‌ గుంతలో పడి ఇద్దరు యువకులు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలి’’ అని కన్నా గురువారం ట్వీట్‌ చేశారు.


ట్రూ అప్‌ ఛార్జీల నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

విజయవాడ (అలంకార్‌ కూడలి), న్యూస్‌టుడే: విద్యుత్తు ట్రూ అప్‌ ఛార్జీల భారం ప్రజలపై పడుతోందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యుత్తు ఛార్జీలను పెంచలేదని ఒక వైపున నోటిఫికేషన్‌ జారీ చేస్తూ మరోవైపు సర్దుబాటు ఛార్జీల(ట్రూఅప్‌) పేరుతో దొడ్డిదారిన ప్రజలపై భారం మోపారని ఆయన ఆరోపించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలో ప్రతి నెలా విద్యుత్తు యూనిట్‌కు 40 పైసలు చొప్పున అదనంగా ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారని మండిపడ్డారు. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని విమర్శించారు.


కక్ష సాధింపులో భాగంగానే ఒంటిపూట బడులు పెట్టలేదు

సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని బహిరంగ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉపాధ్యాయులపై కక్ష సాధింపులో భాగంగానే మార్చి నెల ముగుస్తున్నా జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఒంటి పూట బడులు ప్రారంభించలేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రకారం మార్చి మొదటి, రెండు వారాల్లో ఒంటి పూట బడులు పెట్టడం దశాబ్దాలుగా అమలవుతోందని..కానీ ఈ ఏడాది ఇప్పటి వరకూ ప్రభుత్వం ఈ విషయంపై ఆసక్తి చూపకపోవడం దారుణమని దుయ్యబట్టారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచైనా ఒంటిపూట బడులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘ఒంటిపూట బడులపై ప్రశ్నించిన ఉపాధ్యాయులపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటు. ఒంటి పూట బడులు పిల్లలకా? మీకా?అంటూ ఉపాధ్యాయులతో ఆయన చులకనగా మాట్లాడటం నీతిమాలిన చర్య’ అని అనగాని సత్యప్రసాద్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు