తెలంగాణలో భాజపా ఎందుకు?: కేటీఆర్‌.. రాష్ట్రంలో కేసీఆర్‌ ఎందుకు?: బండి సంజయ్‌

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల మధ్య గురువారం మరోమారు ట్విటర్‌ పోరు జరిగింది.

Published : 31 Mar 2023 03:56 IST

ఇరువురి మధ్య ట్వీట్‌ వార్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల మధ్య గురువారం మరోమారు ట్విటర్‌ పోరు జరిగింది. ప్రధానిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో విమర్శలు చేయగా.. దీనికి ప్రతిగా, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

‘ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించింది. తెలంగాణకు చెందిన నలుగురు వెన్నెముక లేని భాజపా ఎంపీలు దీనికి బాధ్యత వహించాలి’ అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో విమర్శించారు. ‘తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీని నిరాకరించి, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌కు రూ.20 వేల కోట్ల లోకోమోటివ్‌ కోచ్‌ ఫ్యాక్టరీని కేటాయించారు.  దీంతో పాటు పసుపు బోర్డు, మెట్రో రెండో దశ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా.. ఇవేవీ ప్రధాని ప్రాధాన్యతల్లో లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యత క్రమంలో మాత్రం ప్రధాని ఎందుకుండాలి? తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి’? అని భాజపాను ఉద్దేశించి కేటీఆర్‌ దుయ్యబట్టారు. దీనికి బండి సంజయ్‌ ప్రతిస్పందిస్తూ.. తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం, దళితులకు మూడెకరాల భూమి, వారికి సీఎం పదవి, కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రెండు పడకగదుల ఇళ్లు, అర్హులకు దళితబంధు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు.. ఇవేవీ ఇవ్వలేదని సీఎంపై విమర్శలు గుప్పించారు. ‘ప్రధానమైన బాధ్యతల్లో ప్రజలకు ముఖ్యమంత్రి చోటివ్వనప్పుడు ఆయనను ఎందుకు భరించాలి, ఎందుకు సహించాలి? అసలు కేసీఆర్‌ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే.. ఆయనను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదు?’ అని సంజయ్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని