విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం అణచివేస్తోంది: షర్మిల

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై పోరాడుతున్న ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై కేసీఆర్‌ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Published : 31 Mar 2023 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై పోరాడుతున్న ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై కేసీఆర్‌ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి లాఠీఛార్జి, అరెస్టులు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. నాడు తమ ఉద్యోగాలు తమకేనంటూ విద్యార్థులు కొట్లాడకపోతే, నిరుద్యోగులు బలిదానాలు చేసుకోకపోతే రాష్ట్రం సిద్ధించేదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో పోటీ పరీక్షలు రాయొద్దని విద్యార్థులను రెచ్చగొట్టి కేసీఆర్‌ వారిని మోసం చేశారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు ఊరించి నోటిఫికేషన్లు విడుదల చేసినా ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ కాలేదని అన్నారు. లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అంగట్లో పెట్టారని విమర్శించారు. లీకుల వెనుక మీ హస్తం లేకపోతే విద్యార్థులు అడుగుతున్నట్లు సిట్‌తో కాకుండా సీబీఐతో లేదా సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను షర్మిల డిమాండ్‌ చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు తక్షణమే రూ.50 వేల చొప్పున ప్రకటించాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు