అన్నన్నా..! అసెంబ్లీలో అశ్లీల వీడియోలా!

త్రిపుర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యే అశ్లీల వీడియోలు చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 31 Mar 2023 06:51 IST

అడ్డంగా దొరికిన త్రిపుర భాజపా ఎమ్మెల్యే

అగర్తల: త్రిపుర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యే అశ్లీల వీడియోలు చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అగర్తలలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. బుధవారం జరిగిన బడ్జెట్‌ చర్చల సందర్భంగా భాజపా ఎమ్యెల్యే జాదబ్‌లాల్‌ నాథ్‌ (55) సభలో పోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియోను ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. వీడియోలో జాదబ్‌లాల్‌ ఒళ్లో టాబ్లెట్‌ పెట్టుకొని అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు ఒక ప్రజాప్రతినిధి చట్టసభలో ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఇంకా తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అసెంబ్లీ స్పీకర్‌ విశ్వబంధు సేన్‌ తెలిపారు. గతంలో సీపీఎంలో ఉన్న జాదబ్‌లాల్‌ 2018 ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. ఆ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ రామేంద్రచంద్ర దేబ్‌నాథ్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బాగ్‌బాసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ‘‘సభలో మొబైల్‌ ఫోను వాడటం నిషేధమని నాకు తెలుసు. పదే పదే కాల్‌ రావడంతో ఫోను తీశా. అంతే.. అశ్లీల వీడియోలు వాటంతట అవే వచ్చాయి’’ అని జాదబ్‌లాల్‌ మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యేల ప్రతిష్ఠను దిగజార్చిన భాజపా సభ్యుడిపై స్పీకర్‌ కఠినచర్య తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. 2012లో కర్ణాటక అసెంబ్లీలోనూ ముగ్గురు భాజపా మంత్రులు అశ్లీల వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు