కేంద్రంపై పోరుకు విపక్షం సై!

కేంద్రంలోని భాజపా సర్కారుపై ధ్వజమెత్తడానికి విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. కమలనాథుల్ని గద్దె దించేందుకు దిల్లీకి వెళ్దామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చారు.

Published : 31 Mar 2023 03:56 IST

దిల్లీపై దండెత్తాలని మమత పిలుపు

దిల్లీ: కేంద్రంలోని భాజపా సర్కారుపై ధ్వజమెత్తడానికి విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. కమలనాథుల్ని గద్దె దించేందుకు దిల్లీకి వెళ్దామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. మోదీని అధికారం నుంచి తొలగించి దేశాన్ని రక్షించుకోవాలంటూ దేశవ్యాప్త పోస్టర్ల ప్రచారానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయంపై విపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని డీఎంకే నిర్ణయించింది. తమ రాష్ట్రంపై కేంద్రం వివక్ష కనపరుస్తోందని ఆరోపిస్తూ కోల్‌కతాలో చేపట్టిన రెండ్రోజుల ధర్నాను మమతా బెనర్జీ గురువారం ముగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఔర్‌ ఏక్‌ దఫా దిల్లీ చలో’ అని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మితవాదపక్ష సర్కారును ఇంటిబాట పట్టించాలంటే ఈ దిశగా ఉద్యమించక తప్పదన్నారు. కాంగ్రెస్‌కు, భాజపాకు సమాన దూరంలో ఉండాలన్న మునుపటి నిర్ణయాన్ని మార్చుకున్న రీతిలో ఆమె మాట్లాడారు. కమలనాథుల్ని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసిరావాలని పిలుపునిచ్చారు. సమాఖ్య స్వరూపాన్ని నాశనం చేసి, భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా చేస్తున్నందుకు దిల్లీకి దండెత్తి ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ‘కేంద్ర సంస్థల ద్వారా, వాటి కోసమే భాజపా ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. భాజపా మినహా విపక్షాలన్నీ అవినీతిమయమేనని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. దుశ్శాసన, దుర్యోధన ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించి, ప్రజాస్వామ్యాన్ని, సామాన్యులను రక్షించాలి’ అని కోరారు.

చెన్నై వేదికగా 3న సమాలోచనలు

దేశంలో సామాజిక న్యాయంపై చర్చకు ఏప్రిల్‌ 3న చెన్నైలో విపక్షాల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ తెలిపారు. కాంగ్రెస్‌ సహా సుమారు 20 పార్టీలు దీనిలో స్వయంగా గానీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా గానీ పాల్గొంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), కె.కేశవరావు (భారాస), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), సంజయ్‌సింగ్‌ (ఆప్‌), డెరెక్‌ ఓబ్రియెన్‌ (తృణమూల్‌) తదితరులు దీనికి హాజరవుతామని ధ్రువీకరించినట్లు వివరించాయి.


మోదీ హటావో.. దేశ్‌ బచావో: ఆప్‌

ప్రధాని మోదీని అధికారం నుంచి దించి, దేశాన్ని రక్షించాలంటూ ‘మోదీ హటావో.. దేశ్‌ బచావో’ నినాదంతో పోస్టర్లను ఆప్‌ ఆవిష్కరించింది. 22 రాష్ట్రాల్లో ప్రచారం కోసం వేర్వేరు భాషల్లో వీటిని రూపొందించి పంపించినట్లు ఆప్‌ దిల్లీ విభాగం కన్వీనర్‌ గోపాల్‌రాయ్‌ తెలిపారు. ఇచ్చిన వాగ్దానాలను మోదీ సర్కారు నిలబెట్టుకోకపోగా ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిపై విద్యార్థుల్లో అవగాహన కోసం ఏప్రిల్‌ 10 నుంచి అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టర్లు అంటిస్తామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు