మొదలవుతోంది.. స్టిక్కర్ల వంతు!

అధికార వైకాపా మళ్లీ ప్రజల ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమైంది. స్టిక్కర్లు పట్టుకుని వాటిని ఇళ్లకు, ప్రజల సెల్‌ఫోన్లకూ అతికించే పని మొదలుపెడుతోంది.

Updated : 31 Mar 2023 07:33 IST

1 నుంచి వైకాపా క్షేత్రస్థాయి సమావేశాలు
3న సీఎం సమీక్షలోనూ చర్చ
ఏప్రిల్‌ 7 నుంచి వారోత్సవాలు

ఈనాడు, అమరావతి: అధికార వైకాపా మళ్లీ ప్రజల ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమైంది. స్టిక్కర్లు పట్టుకుని వాటిని ఇళ్లకు, ప్రజల సెల్‌ఫోన్లకూ అతికించే పని మొదలుపెడుతోంది. ఈ పేరుతో మరో ప్రచారార్భాటానికి తెరతీస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ఇటీవలి వరకు తిరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని వైకాపా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. శనివారం నుంచి అయిదు రోజులపాటు మండల పార్టీ బాధ్యులు, సచివాలయ సమన్వయకర్తలు, గృహసారథులు, గ్రామ/వార్డు వాలంటీర్లతో సచివాలయాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రచారంలో ఎవరెవరు ఏం చేయాలో ఈ సమావేశాల్లో ప్రాథమికంగా నిర్దేశించుకోనున్నారు. సచివాలయ సమన్వయకర్తలు, గృహ సారథులను వాలంటీర్లకు పరిచయం చేయడం, వాలంటీర్లు తమ పరిధిలోని ఇళ్ల వివరాలను వారికి తెలియజేయడం ఉంటాయి. ఏప్రిల్‌ 3న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై సమీక్షలో భాగంగా ఈ అంశంపైనా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో చర్చిస్తారు. అనంతరం ఏప్రిల్‌ 7 నుంచి 14వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ప్రచార వారోత్సవం చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోని ఇంటింటికీ తిరిగేలా దీన్ని రూపొందించారు.

విమర్శలొచ్చినా వాలంటీర్లతోనే..

పూర్తిగా పార్టీపరంగా చేపట్టే ఈ ప్రచార ప్రారంభ ప్రక్రియలో వాలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నారు. ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్న వాలంటీర్లను పార్టీ కార్యకలాపాలకు ఎలా ఉపయోగించుకుంటారని విమర్శలు వస్తున్నా పార్టీ అధిష్ఠానం మాత్రం తగ్గేదే లేదంటోంది. ఏయే ఇళ్లకు ఏయే పథకాలు అందాయి.. ఆ ఇళ్లలో ఎందరు ఓటర్లు ఉన్నారనే వివరాలన్నీ వాలంటీర్ల వద్ద ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు వారి సేవలూ ఉపయోగించుకునేలా శిక్షణ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిసింది. సచివాలయ సమన్వయకర్తలు, గృహసారథులకే వాలంటీర్లు మొదట సాయం చేస్తారని, వారికి సమాచారం అందిస్తారని వైకాపా నాయకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయి ప్రచారంలో వాలంటీర్ల సేవలను వినియోగించుకోకుండా ఎలాగని.. వారూ తమతోనే ఉంటారని పార్టీవర్గాలు అంటున్నాయి. ఈ ప్రచార వారోత్సవం సందర్భంగా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అని ఉన్న స్టిక్కర్లను ఇళ్లకు, చిన్నసైజు స్టిక్కర్లను ఆయా ఇళ్లలోవారి సెల్‌ఫోన్లకు అతికించనున్నారు. ఫిబ్రవరి 13న మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సీఎం సమావేశమైన సందర్భంలోనే ఈ స్టిక్కర్లను వారికి అందజేశారు. మార్చి 18 నుంచే స్టిక్కర్ల కార్యక్రమం మొదలుపెట్టాలనుకున్నా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఆగారు. ఏప్రిల్‌ 7 నుంచి పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు