రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు..

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని సాధారణ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను వైకాపా నిలబెట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

Published : 31 Mar 2023 04:36 IST

వైకాపా, భాజపాలపై సీపీఎం ధ్వజం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని సాధారణ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను వైకాపా నిలబెట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన పాపం వైకాపా, భాజపాలదేనని ఆరోపించారు. అమరావతి రైతులు, ప్రజల ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. ‘వైకాపా, భాజపా కుమ్మక్కై అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ప్రజలు, రైతులకు పూలింగ్‌ చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ 1200 రోజులుగా రైతులు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. వారందరికీ సీపీఎం అభినందనలు తెలుపుతోంది. తొలి నుంచి సీపీఎం ఈ ఉద్యమానికి అండగా ఉంది. మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. రాజధానిగా అమరావతిని ఏర్పాటుచేసే విషయంలో శాసనసభలో సీఎం జగన్‌ మద్దతు తెలిపారు. అమరావతిని కొనసాగిస్తామని, మరింత మెరుగైన రీతిలో అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీనిచ్చారు. ఆ తర్వాత మాట తప్పి 3రాజధానుల పేరుతో వివాదానికి తెర తీశారు. మూడు రాజధానులని ఒక మాట, విశాఖే రాజధాని అని మరోమాట మాట్లాడుతూ వైకాపా నేతలు గందరగోళం సృష్టిస్తున్నారు. వికేంద్రీకరణ సాకుతో రాజధానిని చిన్నాభిన్నం చేస్తున్నారు. దిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని 2014 ఎన్నికల్లో హామీనిచ్చిన మోదీ దాన్ని పూర్తిగా విస్మరించారు. నమ్మకద్రోహం చేశారు’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు