ఉదయగిరిలో సవాళ్ల పర్వం

పార్టీ ద్రోహి... ఉదయగిరి నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపో.. అంటూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు గురువారం ర్యాలీ నిర్వహించారు.

Updated : 31 Mar 2023 05:57 IST

వైకాపా నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రదర్శన
కాసేపటికి బస్టాండుకు ఎమ్మెల్యే మేకపాటి రావడంతో ఉద్రిక్తత

ఉదయగిరి, న్యూస్‌టుడే: పార్టీ ద్రోహి... ఉదయగిరి నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపో.. అంటూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు గురువారం ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సొసైటీ మాజీ అధ్యక్షుడు మూలె వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చారు. వినయ్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లుగా ప్రజలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు కావడంతో ఆయన మీద అభిమానంతో ఏమీ అనలేకపోయామని వివరించారు. చంద్రశేఖర్‌రెడ్డి సవాలు చేశారని తెలుసుకున్న వినయ్‌రెడ్డి గురువారం రాత్రి బస్టాండు సెంటర్‌కు చేరుకున్నారు. తాము ర్యాలీ ముగించుకొని వెళ్లాక ఎమ్మెల్యే వచ్చి ‘ఉదయగిరికి వచ్చాను దమ్ముంటే రండి’ అన్నారని.. రేపు, ఎల్లుండి ఉదయగిరిలోనే ఉంటామని ఆయన వస్తే తేల్చుకుందామన్నారు.

తల తెగిపడినా తగ్గేదే లేదు

‘తల తెగి ఉదయగిరి ట్యాంకుబండ్‌లో పడినా తగ్గేదే లేదు.. నన్ను తరుముతామంటూ కొందరు చిల్లరగాళ్లు మాట్లాడుతున్నారు... మీరేమైనా బ్రిటిష్‌ రాజులా... ఇదేమైనా బ్రిటిష్‌ పాలనా’ అని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఉదయగిరిలోని తన అతిథిగృహంలో గురువారం ఆయన మాట్లాడారు. అనంతరం తన వద్దకు వచ్చిన నాయకులతో కలిసి బస్టాండుకు చేరుకొని అక్కడ రోడ్డుపై కుర్చీ వేసుకొని కూర్చున్నారు. ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ.. తనను తరుముతామని చిల్లరగాళ్లు అన్నారని, అందుకే ఉదయగిరికి వచ్చానని, తరిమేవాడెవడో ధైర్యముంటే తనకు ఎదురుగా రావాలని సవాలు విసిరారు. తనపై లేనిపోని అభాండాలు మోపి పార్టీనుంచి సస్పెండ్‌ చేశారని చెప్పారు. వైకాపాకు ఎనలేని సేవచేసిన వ్యక్తినని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. జగన్‌ కోసం అధికారాన్ని సైతం వదిలేసి వచ్చానని, సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని గెలిచానని తెలిపారు. ఎవరైనా అతిగా మాట్లాడితే వారికి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అకస్మాత్తుగా బస్టాండు సెంటర్‌లో రోడ్డుపై కుర్చీ వేసుకొని కూర్చొని సవాలు చేయడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు